మహిళలకు తమ కలెక్షన్లో రకరకాల నెయిల్ పాలిష్ రంగులు ఉండటం అంటే చాలా ఇష్టం. అయితే, చాలా కాలం పాటు వాడకపోవడం వల్ల లేదా మూత సరిగ్గా పెట్టకపోవడం వల్ల నెయిల్ పాలిష్ తరచుగా ఎండిపోతుంటుంది. ఇలా గడ్డకట్టినప్పుడు అది గోర్లకు పెట్టుకోవడానికి వీలు పడదు. చాలా మంది ఇది పాడైపోయిందని భావించి పారేస్తుంటారు. కానీ, కొన్ని చిన్న చిట్కాలతో దానిని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..
వేడి నీటి చికిత్స (Hot Water Bath):
ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను సరిచేయడానికి ఇది అత్యంత సులభమైన పద్ధతి. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో నెయిల్ పాలిష్ బాటిల్‌ను సుమారు 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచండి. నీరు మరీ మరిగేలా ఉండకూడదు. వేడి వల్ల బాటిల్ లోపల గడ్డకట్టిన నెయిల్ పెయింట్ కరిగి, మళ్ళీ ద్రవ రూపంలోకి మారుతుంది.
నెయిల్ పాలిష్ థిన్నర్ లేదా రిమూవర్:
బాటిల్లో కొన్ని చుక్కల నెయిల్ పాలిష్ థిన్నర్‌ను వేయండి. ఒకవేళ థిన్నర్ లేకపోతే, నెయిల్ పాలిష్ రిమూవర్‌ను కూడా వాడవచ్చు. అయితే రిమూవర్ మరీ ఎక్కువగా వేయకండి, ఎందుకంటే అది రంగును పలచబరిచే అవకాశం ఉంది. కేవలం రెండు మూడు చుక్కలు వేసి బాటిల్‌ను బాగా ఊపితే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి
అరచేతులతో వేడిని పుట్టించడం:
నెయిల్ పాలిష్ బాటిల్‌ను రెండు అరచేతుల మధ్య ఉంచి వేగంగా అటు ఇటు దొర్లించండి (Roll చేయండి). ఇలా రుద్ధడం వల్ల కలిగే ఘర్షణ వల్ల వేడి పుట్టి, లోపల ఉన్న రంగు మృదువుగా మారుతుంది. బాటిల్‌ను పైకి కిందకు గట్టిగా ఊపడం కంటే ఇలా దొర్లించడం వల్ల గాలి బుడగలు (Air Bubbles) రాకుండా ఉంటాయి.
నివారణోపాయాలు:
నెయిల్ పాలిష్ ఎండిపోకుండా ఉండాలంటే, వాడిన ప్రతిసారీ మూతను గట్టిగా బిగించాలి. అలాగే, బాటిల్ మెడ భాగంలో అంటుకున్న రంగును రిమూవర్‌తో తుడిచి శుభ్రంగా ఉంచాలి. దీనివల్ల గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది.
ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే మీ ఇష్టమైన నెయిల్ పాలిష్‌లను వృథా చేయకుండా, ఎక్కువ కాలం పాటు అందంగా వాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..