పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు, భద్రతా భయాలు పెరగడంతో, ప్రపంచ షిప్పింగ్ రంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల ప్రభావంతో ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన MSC మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ తన వ్యాపార నమూనాలో పెద్ద మార్పు చేసింది. ప్రమాదకరమైన సముద్ర మార్గాలను తప్పించేందుకు, సౌదీ అరేబియా గుండా భూమార్గాల ద్వారా సరుకులను రవాణా చేయాలని నిర్ణయించింది. మే 10 నుంచి బెల్జియంలోని ఆంట్వెర్ప్ నుంచి కొత్త లాజిస్టిక్స్ సేవ ప్రారంభం కానుంది.
ఈ కొత్త విధానంలో భారీ సరుకు నౌకలు యూరప్ నుంచి సూయజ్ కాలువ మీదుగా ఎర్ర సముద్రానికి చేరుకుని, సౌదీ అరేబియా పశ్చిమ తీరంలోని జెడ్డా, కింగ్ అబ్దుల్లా పోర్టుల్లో సరుకులను దింపుతాయి. అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలోని దమ్మామ్‌కు సరుకులు తరలిస్తారు. అనంతరం చిన్న ఫీడర్ నౌకల ద్వారా దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, ఇరాక్‌లకు పంపిణీ చేస్తారు. ఈ మార్పు వల్ల సరఫరా గొలుసు నెమ్మదించడమే కాకుండా రవాణా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ట్రక్కుల ద్వారా దీర్ఘ దూర రవాణా చేయాల్సి రావడం వల్ల ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతాయి. చివరికి ఈ అదనపు వ్యయ భారం వినియోగదారులపైనే పడే అవకాశముంది. నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సంక్షోభం నేపథ్యంలో హపాగ్-లాయిడ్, మేర్స్క్ వంటి ఇతర అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజాలు కూడా “ల్యాండ్‌బ్రిడ్జ్” వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఒమన్, సౌదీ అరేబియా మార్గాల ద్వారా సరుకులను తరలిస్తూ, సముద్ర మార్గాలపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఒమన్, యూఏఈ తూర్పు తీరాల్లో సరుకుల నిల్వలు పెరుగుతుండగా, ట్రక్కుల కొరత కూడా కనిపిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం కొత్త అనిశ్చిత దశలోకి ప్రవేశించిందనే సంకేతాలను ఇస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి