మునగాకు కేవలం విటమిన్ 'ఏ' కు గొప్ప వనరు మాత్రమే కాదు, డయాబెటిస్ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించి, రక్తంలో చక్కెరను కణాల్లోకి వేగంగా చేరేలా చేస్తుంది. తద్వారా ప్యాంక్రియాస్‌ను చురుకుగా ఉంచుతుంది. మునగాకులో క్వర్సటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరిన రెండు మూడు నెలల్లోనే యాంటీఆక్సిడెంట్ల స్థాయిని 40 శాతం వరకు పెంచుతాయి.
రక్తనాళాల్లో రఫ్‌గా మారిన ప్రదేశాల్లోనే కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్, కాల్షియం వంటివి పేరుకుపోయి పూడికలు ఏర్పడతాయి. ఈ మునగాకును మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మునగాకులోని యాంటీఆక్సిడెంట్లు వీటిని నివారించి, రక్తనాళాల పొరను నునుపుగా ఉంచుతాయి. తద్వారా పూడికలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
మునగాకు గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. రోజుకు 14 గ్రాముల మునగాకు పొడిని ఒక నెలపాటు వాడితే LDL కొలెస్ట్రాల్ 30 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె బ్లాక్స్ రాకుండా రక్షించడానికి ఇది రెండో ముఖ్య కారణం.
అంతేకాదు బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడంతోనూ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర కణాల్లోకి వేగంగా చేరి, బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక రక్త చక్కెర వల్ల వచ్చే మంట నివారించబడి, రక్తనాళాల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
ఈ మునగాకును మీరు అనేక రకాలుగా ఆహారంలోకి చేర్చుకోవచ్చు. పుల్కా లేదా రొట్టెలు చేసుకునే పిండిలో 1-2 స్పూన్ల మునగాకు పొడిని కలుపుకోవచ్చు. లేదా మీరు తాగే వెజిటబుల్ జ్యూస్‌లో ఒక స్పూన్ లేదా స్పూన్నర మునగాకు పొడిని వేసుకుని తాగవచ్చు. అలాగే మునగాకు పొడిని ధనియాలు, జీలకర్ర వంటి వాటితో కలిపి కారప్పొడిలా తయారు చేసుకుని రోజూ అన్నంలో తినవచ్చు. అంతేకాకుండా, రోజువారీ వండే కూరలలో కూడా మునగాకు పొడిని చల్లుకోవచ్చు. ఇలా నిత్యం తీసుకుంటే కుటుంబమంతా గుండె జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.




