Tejasvi Dahiya: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2026లో ఢిల్లీ వికెట్ కీపర్-బ్యాటర్ తేజస్వి దహియా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. నవంబర్ 22న హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 9వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి 36 బంతుల్లో 95 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. ఇది అతడి 13వ టీ20 మ్యాచ్ మాత్రమే. అంతకుముందు అతడి అత్యధిక స్కోర్ 53 నాటౌట్.
తేజస్వి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 232/6 భారీ స్కోర్ చేసింది. ఛేదనలో హర్యానా 189/8కే పరిమితమైంది. ఢిల్లీ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిలో దహియా..
డిసెంబర్ 16న గోవాలో జరగనున్న IPL 2027 మినీ వేలానికి కొన్ని వారాల ముందు దహియా ఇలా చెలరేగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోసం చూస్తున్న ఏ జట్టైనా, కనీసం బ్యాకప్గానైనా అతడివైపు చూసే అవకాశం ఉంది.
IPL 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన దహియా.. IPL 2026 మినీ వేలంలో మాత్రం బిడ్డింగ్ వార్‌కు కారణమయ్యాడు. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడగా చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3 కోట్లకు దక్కించుకుంది.
KKRలో నిరాశపరిచిన దహియా..
అయితే KKR తరఫున అరంగేట్ర సీజన్లో దహియా రాణించలేకపోయాడు. కేవలం 2 మ్యాచ్‌ల్లో 12 పరుగులే చేశాడు. అంగ్క్రిష్ రఘువంశీ కన్కషన్ రీప్లేస్‌మెంట్‌గా IPL అరంగేట్రం చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ముంబైపై 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 12 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో KKR 163కు ఆలౌటై 40 పరుగులతో ఓడింది. దీంతో IPL 2027 వేలానికి ముందు KKR అతడిని రిలీజ్ చేసింది.
SMAT 2026లో దహియా జోరు..
ఈ సీజన్లో ఇది అతడికి రెండో హాఫ్ సెంచరీ. జమ్మూకాశ్మీర్‌పై 46, పంజాబ్‌పై 20, బిహార్‌పై 51, సౌరాష్ట్రపై 18 పరుగులు చేశాడు. 5 మ్యాచ్‌ల్లో 230 పరుగులతో ఢిల్లీ తరఫున రెండో అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. సగటు 46, స్ట్రైక్ రేట్ 223.30తో దూసుకుపోతున్నాడు.
మళ్లీ KKR అతడిని తక్కువ ధరకు తీసుకుంటుందా అనేది ఆసక్తికరం. ప్రస్తుతం KKR వద్ద రఘువంశీ, టిమ్ సీఫర్ట్ వికెట్ కీపింగ్ ఆప్షన్లు ఉన్నారు.
మ్యాచ్ విశేషాలు..
టాస్ గెలిచిన హర్యానా కెప్టెన్ అంకిత్ రాజేశ్ కుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రియాన్ష్ ఆర్య, యశ్ ధుల్ ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడారు. ధుల్ 12 బంతుల్లో 26 చేసి ఔటయ్యాడు. నితీశ్ రాణా 20 బంతుల్లో 37 (5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. 11వ ఓవర్లో తొలి సిక్స్ బాదిన దహియా.. చహల్‌ను వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆర్య 40 బంతుల్లో 62 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. చివరి బంతికి సెంచరీ కోసం సిక్స్ అవసరమై ఆ ప్రయత్నంలో ఔటయ్యాడు. ఢిల్లీ 232/6 చేసింది.
ఛేదనలో అంకిత్ 17 బంతుల్లో 32, యశ్వర్ధన్ దలాల్ 18 బంతుల్లో 28తో శుభారంభం ఇచ్చినా మయాంక్ యాదవ్, సుయాశ్ శర్మ దెబ్బతీశారు. హర్యానా 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. సుమిత్ కుమార్ 19 బంతుల్లో 33 నాటౌట్‌తో పోరాడినా ఫలితం లేకపోయింది. హర్యానా 189/8తో ఓడింది.
ఇది ఢిల్లీకి మూడో విజయం. నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది. తదుపరి మ్యాచ్‌ల్లో నవంబర్ 24న తమిళనాడుతో, నవంబర్ 26న రైల్వేస్‌తో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..