Headlines

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. మార్చి 18 నుంచి పబ్లిక్ పరీక్షలు! టైం టేబుల్‌ రెడీ


హైదరాబాద్‌, నవంబర్‌ 23: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ షెడ్యూల్‌కు అనుమతి కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం లభించిన తర్వాత అధికారికంగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం మార్చి 18న ప్రారంభమయ్యే పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షల ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం 24 రోజుల వ్యవధి ఉండనుంది.

పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు ఉంటాయి. సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు మొత్తం ఏడు రోజులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు గతేడాది నుంచి సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య వ్యవధిని పెంచారు. ఈ విధానాన్ని ఈసారి కూడా కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలకు సుమారు 5.25 లక్షల నుంచి 5.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ మార్కుల మెమోలో తప్పుల సవరణకు పాఠశాల విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఇకపై మీ సేవా పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ఆఫ్‌లైన్ లేదా మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించకూడదని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానంపై డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి



మెమోలో తప్పులుంటే ఎలా సరిచేసుకోవాలి?

గతంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన మూడేళ్లలోపు విద్యార్థులు తమ మార్కుల మెమోలో తప్పుల సవరణ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆమోదంతో ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. మూడేళ్లకు మించి సమయం గడిచిన సందర్భాల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత బోర్డు ద్వారా సవరణలు చేయించుకోవాల్సి వచ్చేది. అయితే కొత్త విధానంలో మీ సేవా కేంద్రంలో నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి. అనంతరం మీ సేవా పోర్టల్ ద్వారా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం వెళ్తుంది. హెచ్‌ఎం ఆమోదం తెలిపిన తర్వాత దరఖాస్తుదారులు సర్టిఫికెట్లలో సవరణల కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల దరఖాస్తు ప్రక్రియలో ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటికీ, సవరణలు పూర్తయ్యేందుకు గతంలో కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా పదో తరగతి పరీక్షల తేదీలు ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన ప్రతిపాదిత షెడ్యూల్‌లో భాగం మాత్రమే. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాత పరీక్షల తేదీలపై స్పష్టత రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *