Headlines

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ పెరుగుతుందంటున్న నిపుణులు!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ పెరుగుతుందంటున్న నిపుణులు!


భారతదేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచిన నిర్ణయం దేశవ్యాప్తంగా జువెలరీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఒకవైపు విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు స్మగ్లింగ్‌, గ్రే మార్కెట్‌ పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ఛైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడుతూ.. భారీ పన్నులు అక్రమ బంగారం దిగుమతులకు ప్రోత్సాహం కల్పించే అవకాశం ఉంది. ఇది సమాంతర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు.

కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, వ్యవసాయ సెస్ కలిపి ప్రతి 10 గ్రాముల బంగారంపై పన్ను భారం సుమారు రూ.27 వేల వరకు చేరే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ ఈ ధరల పెరుగుదలను పన్ను ప్రభావంతో జరిగిన ధరల పునఃసమీకరణగా అభివర్ణించారు. ఇది బంగారం డిమాండ్ వల్ల వచ్చిన ర్యాలీ కాదని, ప్రభుత్వ విధాన మార్పుల ప్రభావమేనని తెలిపారు. ఇకపై భారత మార్కెట్లో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకపు విలువ ఆధారంగా కదిలే అవకాశముందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత బంగారం దిగుమతులు 24 శాతం పెరిగి 71.98 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత కూడా ప్రభుత్వ ఆందోళనకు కారణమయ్యాయి. సెంకో గోల్డ్ & డైమండ్స్ సీఈఓ సువంకర్ సేన్ అభిప్రాయం ప్రకారం పెరిగిన ధరల కారణంగా బంగారు ఆభరణాల అమ్మకాలు 10-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాల వైపు మొగ్గు చూపవచ్చని ఆయన తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *