పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ప్రతి నెలా చేతికి స్థిరమైన ఆదాయం అందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ భద్రతతో కూడిన రాబడిని అందించే పథకాల్లో పోస్టాఫీసు పొదుపు పథకాలు ఎప్పుడూ ముందుంటాయి. అందులో ముఖ్యంగా వృద్ధుల కోసం రూపొందించిన పోస్టాఫీసు వయోవృద్ధుల పొదుపు పథకం ఇప్పుడు ఎంతో ప్రజాదరణ పొందుతోంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే నెలకు గరిష్టంగా రూ. 20,500 వరకు వడ్డీ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. సాధారణ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లతో పోలిస్తే పోస్టాఫీసు అందించే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకంపై సంవత్సరానికి 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. కనీసం రూ. 1,000తో ఎవరైనా సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల పెట్టుబడికి 100 శాతం భద్రత లభిస్తుంది.
నెలకు రూ. 20,500 ఆదాయం ఎలా వస్తుంది?
ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితిని రూ. 30 లక్షలుగా నిర్ణయించారు. ఒకవేళ మీరు జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి ఖాతా ద్వారా గరిష్టంగా రూ.30 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే, 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి రూ.2,46,000 వడ్డీ జమ అవుతుంది. ఈ లెక్కన ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఖాతాలో రూ.61,500 వడ్డీ జమ అవుతుంది. అంటే సగటున నెలకు రూ.20,500 ఆదాయం లభించినట్లే. ఒకవేళ సింగిల్ ఖాతాలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, నెలకు సగటున రూ.10,250 వరకు వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు.
పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా..
అధిక వడ్డీతో పాటు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బును సురక్షితమైన చోట దాచుకుని, ప్రతి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తరహాలో ఆదాయం పొందాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఈ పోస్టాఫీసు పథకం ఒక చక్కని వరమని చెప్పవచ్చు.