సినిమా.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఒక స్పెషల్ ఎమోషన్. ఒక్కసారి థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చామంటే.. భారీ తెర, అద్భుతమైన సౌండ్ సిస్టమ్, చుట్టూ ప్రేక్షకుల సందడితో వేరే ప్రపంచం లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకప్పుడు సినిమా అంటే సింగిల్ స్క్రీన్ గుర్తొచ్చేవి. ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రయాణంలో మన దేశంలో తొలి ప్రత్యేక సినిమా హాలు ఎక్కడ నిర్మించారో ఎప్పుడైనా ఆలోచించారా ?
1907 లోనే తొలి ప్రత్యేక సినిమా హాలు..
ఒకప్పుడు వేలాది మంది ప్రేక్షకులను అలరించిన ఆ చారిత్రక థియేటర్ ఇప్పుడు మన మధ్య లేదు.. కానీ భారతీయ సినిమా చరిత్రలో మాత్రం దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్. నేటి కోల్‌కతాగా పిలుస్తున్న అప్పటి కలకత్తాలో 1907లో జంషెడ్జీ ఫ్రాంజీ మదన్ (J.F.Madan) ఈ సినిమా హాలును ఏర్పాటు చేశారు. భారతీయ సినిమా రంగంలో మార్గదర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన.. తొలుత బహిరంగ ప్రదేశాల్లో, తాత్కాలిక గుడారాల్లో సినిమాలను ప్రదర్శించేవారు. ఈ ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో శాశ్వతంగా సినిమా ప్రదర్శించేందుకు ప్రత్యేక భవనం అవసరమని భావించారు. అలా ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ రూపుదిద్దుకుంది.
మూకీ సినిమాల నుంచి మొదలైన ప్రయాణం..
ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ ప్రారంభమైన సమయంలో ప్రపంచవ్యాప్తంగా మూకీ సినిమాల హవా కొనసాగుతోంది. తెరపై నటీనటులు కనిపించినా వారి మాటలు వినిపించేవి కావని.. కథను అర్థం చేసుకునేందుకు మధ్య మధ్యలో వివరణాత్మక టైటిల్ కార్డులు చూపించేవారు. కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన సమయంలో సంగీతకారులు ప్రత్యక్షంగా సంగీతం అందించేవారు. ఈ థియేటర్లో విదేశీ చిత్రాలు, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు ప్రదర్శించేవారు. ఇక 1917 నాటికి ఈ హాలులో సుమారు 1,700 మంది కూర్చునే సదుపాయం ఉండేదని అప్పటి రికార్డులను ఉటంకిస్తూ చారిత్రక పరిశోధనలు పేర్కొంటున్నాయి.
ఆసియాలోనే తొలి ప్రత్యేక గుర్తింపు..
సినిమా చరిత్రలో ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1929లో ఈ థియేటర్లో శాశ్వత సౌండ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆసియాలో శాశ్వత ధ్వని సౌకర్యాలు కలిగిన తొలి సినిమా హాలుగా ఇది గుర్తింపు పొందింది. అదే ఏడాది యూనివర్సల్ సంస్థ నిర్మించిన ‘మెలడీ ఆఫ్ లవ్’ (Melody of Love) అనే టాకీ చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించారు. భారతదేశంలో తొలి టాకీ ప్రదర్శనల్లో ఇదొక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.
ఎల్ఫిన్‌స్టోన్ నుంచి మినర్వా.. ఆ తర్వాత చాప్లిన్
కాలక్రమంలో ఈ చారిత్రక సినిమా హాలు పేర్లు మారుతూ వచ్చాయి. మొదట ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌గా ప్రారంభమైన ఈ థియేటర్ తర్వాత మినర్వా సినిమా పేరుతో ప్రసిద్ధి చెందింది. అనంతరం ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ గౌరవార్థం దీనికి చాప్లిన్ సినిమా హాలుగా పేరు మార్చారు. అయితే పేరు మారినా, భవనం పాత వైభవాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. నిర్వహణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కాలానుగుణంగా మారుతున్న సినిమా ప్రేక్షకుల అభిరుచులు వంటి కారణాలతో ఈ థియేటర్ క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోయింది.
2013లో నేలమట్టమైన చారిత్రక భవనం
ఒకప్పుడు భారతీయ సినిమా చరిత్రలో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచిన చాప్లిన్ సినిమా హాలు చివరకు 2013లో కూల్చివేయబడింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఈ భవనాన్ని నేలమట్టం చేసింది.