డాక్టర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది తెల్లకోటు. ఒక్కసారి హాస్పిటల్ లోకి ఎంట్రీ ఇస్తే డాక్టర్లంతా తెల్ల కోటు వేసుకొని తమ తమ పనుల్లో బిజీబిజీగా ఉంటుంటారు. కానీ అదే డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ (OT)లోకి వెళ్లేటప్పుడు మాత్రం తెల్ల కోటు వదిలేసి.. ఆకుపచ్చ (Green) లేదా నీలం (Blue) రంగు దుస్తులు ధరిస్తారు. కేవలం డాక్టర్లే కాదు, నర్సులు కూడా ఇవే రంగుల్లో కనిపిస్తారు. అయితే ఈ రకంగా ధరించడం వెనుక ఏదైనా కారణం ఉందా ? లేదా పాతకాలపు ఆచారమో తెలుసుకుందాం..
కారణం అదే..
అసలు సర్జరీ సమయంలో తెల్లటి దుస్తులకు బదులు ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు ఎంచుకుంటారు? అని అందరికీ వచ్చే డౌటే. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు గంటల తరబడి రోగి శరీరంలోని రక్తాన్ని, ఎర్రటి కణజాలాలను (Tissues)చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అంతసేపు ఎరుపు రంగును చూసిన తర్వాత, ఒక్కసారిగా తెల్లటి గోడల వైపు గానీ, పక్కనున్న వారి తెల్లటి దుస్తుల వైపు గానీ చూస్తే కళ్లు బైర్లు కమ్మినట్లవుతాయని చెబుతున్నారు. అందుకే మంచు మీద ఎండ పడినప్పుడు కళ్లు ఎలా జిగేల్మంటాయో.. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల కళ్లు త్వరగా అలసిపోయి, ఏకాగ్రత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆకుపచ్చ లేదా నీలం రంగు వైపు చూస్తే కళ్లకు హాయిగా అనిపిస్తుందని క్లారిటీ ఇస్తున్నారు.
సర్జరీలో పొరపాట్లు జరగకుండా..
అంతే కాకుండా రంగుల శాస్త్రం (Color Contrast) ప్రకారం ఎరుపు రంగుకు ఆకుపచ్చ, నీలం రంగులు పూర్తి వ్యతిరేకమైనవిగా పరిగణిస్తారు. సర్జరీ చేస్తున్నప్పుడు డాక్టర్లు నిరంతరం ఎర్రటి రక్తాన్ని చూడటం వల్ల, కొంతసేపటికి వారి కళ్లకు ఎరుపు రంగులోని పలు షేడ్స్‌ను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని అంటున్నారు. అలాంటప్పుడు మధ్యమధ్యలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులను చూడటం వల్ల కంటి చూపు మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని చెప్తున్నారు. దాంతో లోపలి అవయవాలు, సున్నితమైన నరాలు స్పష్టంగా కనిపిస్తాయని.. అందువల్ల ఆపరేషన్‌లో ఎలాంటి పొరపాట్లు జరగవని స్పష్టం చేస్తున్నారు.
రక్తపు మరకలు.. మానసిక ఒత్తిడికి చెక్
ఇక తెల్లటి దుస్తులపై చిన్న రక్తపు చుక్క పడినా అది చాలా స్పష్టంగా, భయంకరంగా కనిపిస్తుంది. ఆపరేషన్ థియేటర్లో రక్తపు మరకలతో నిండిన తెల్ల కోటును చూస్తే డాక్టర్లలోనే కాకుండా, అక్కడున్న మిగతా సిబ్బందిలోనూ తెలియని ఆందోళన మొదలవుతుంది. అదే ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులపై రక్తం పడినా అది ముదురు రంగులో కలిసిపోతుంది తప్ప, అంత భయపెట్టేలా కనిపించదు. అంతేకాదు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు రోగి కూడా ఈ రంగులను చూసినప్పుడు కొంత ప్రశాంతంగా, భరోసాగా ఫీలవుతారు.
మెడికల్ సైకాలజీ ఏం చెబుతోంది?
కేవలం కంటి చూపు కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ రంగులను వాడతారు. మెడికల్ సైకాలజీ పరిశోధనల ప్రకారం.. నీలం, ఆకుపచ్చ రంగులు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటు (BP) అదుపులో ఉండటానికి, ఒత్తిడి తగ్గడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. క్షణం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం ఉండే ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు, నర్సులు ఎంతో ప్రశాంతంగా, స్థిరమైన మనసుతో పనిచేయడానికి ఈ రంగులు తోడ్పడతాయి.