Headlines

ఏడాది కాలంగా సెల్ టవర్ వద్ద మాయమవుతున్న బ్యాటరీలు.. ఏంటని చూస్తే మైండ్‌బ్లాక్!


కాకినాడ: సెల్ టవర్ల బ్యాటరీలను చోరీ చేస్తున్న ముఠా గుట్టును కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులు రట్టు చేశారు. టెక్నీషియన్ల ముసుగులో రాత్రివేళ కార్లలో తిరుగుతూ సెల్ టవర్లను టార్గెట్ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 56 సెల్ టవర్లకు చెందిన 67 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాటరీల విక్రయం ద్వారా వచ్చిన రూ.3.75 లక్షల నగదును కూడా సీజ్ చేశారు.

ప్రత్తిపాడు, అన్నవరం, కిర్లంపూడి, గండేపల్లి, పిఠాపురం, అనపర్తి, రాజానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడాది కాలంగా బ్యాటరీల చోరీలు జరుగుతున్నాయి. మొత్తం 374 సెల్ టవర్లకు చెందిన బ్యాటరీలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

సీఐ బి.సూరి అప్పారావు పర్యవేక్షణలో ఎస్సై లక్ష్మీకాంతంతో పాటు మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. టెక్నీషియన్ల ప్రమేయంపై అనుమానంతో నిఘా పెట్టగా.. గొల్లప్రోలు మండలం తాటిపర్తికి చెందిన ఎయిర్‌టెల్ టెక్నీషియన్ అమలకంటి సూరిబాబు అలియాస్ సురేంద్ర, తునికి చెందిన ఎయిర్‌టెల్ టెక్నీషియన్ చిదం కనకదుర్గ పార్థసారథి అలియాస్ పార్థు, ఏటీసీ టెక్నీషియన్ అల్లవరపు వెంకటేష్ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది.

చోరీ చేసిన బ్యాటరీలను తునికి చెందిన పాత ఇనుప సామాన్ల వ్యాపారి పులి రామకృష్ణారెడ్డికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. లంపకలోవ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, అనంతరం వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూదం, ఇతర వ్యసనాల కారణంగానే చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరవనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *