Headlines

Telangana: గుండెల్ని పిండేసే ఘటన.. 4 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా.. ఏం జరిగిందంటే..?


Telangana: గుండెల్ని పిండేసే ఘటన.. 4 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయినయా బిడ్డా.. ఏం జరిగిందంటే..?

అప్పటివరకు కళ్ల ముందే ఆడుతూ పాడుతూ గడిపిన ఆ చిన్నారి.. తల్లిదండ్రుల నవ్వులతో ఇల్లంతా సందడి చేసింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న కారెక్కిన ఆ నాలుగేళ్ల చిన్నారికి అదే మృత్యుకూపంగా మారింది. డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోవడం, బయటకు రాలేక లోపలే ఊపిరాడక స్పృహ కోల్పోయి విగతజీవిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావతి నవీన్, ఐశ్వర్య దంపతులకు తన్విత శ్రీ (4), సురక్ష అనే కూతుళ్లు ఉన్నారు. తన్విత శ్రీ ఏనుకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుంది. ఆదివారం కావడంతో పాఠశాలకు సెలవు ఉండటంతో చిన్నారి ఇంట్లోనే ఉంది. ఉదయం 11 గంటల సమయంలో తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా తన్వితఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. ఇంటి ముందు నిలిపి ఉంచిన తమ కారులోకి సరదాగా ఎక్కింది. ఆ సమయంలో కారు డోరు లాక్ అయిపోవడంతో చిన్నారి లోపలే చిక్కుకుపోయింది. తీవ్రమైన వేడి, ఊపిరాడకపోవడంతో స్పృహతప్పి ముందు సీటు కింద భాగంలో పడిపోయింది.

గ్రామమంతా వెతికారు.. చివరకు కారులోనే
కొద్దిసేపటి తర్వాత ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి బంధువులను, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. గ్రామంలోని సందులన్నీ గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. చివరకు అనుమానం వచ్చి ఇంటి ముందే ఆపి ఉంచిన కారు లోపల చూడగా, ముందు సీటు కింద చిన్నారి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. వెంటనే డోర్లు తెరిచి ఆమెను బయటకు తీసి, జూలూరుపాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చిన్నారి కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సర్పంచ్ ఇంట్లో జరిగిన ఈ విషాదంతో వినోబానగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *