‘ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు’.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!

‘ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు’.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!


Manoj Tiwary TMC Allegations: భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడల శాఖ మాజీ సహాయ మంత్రి మనోజ్ తివారీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యాయం తన జీవితంలో ముగిసిందని స్పష్టం చేశారు. హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడం వెనుక పెద్ద ఎత్తున నగదు డిమాండ్ ఉందని ఆయన ఆరోపించారు. బెంగాల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (10,195 ఫస్ట్ క్లాస్ రన్స్) చేసిన ఘనత కలిగిన ఈ 40 ఏళ్ల క్రీడాకారుడు, మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

టికెట్ల అమ్మకంపై సంచలన ఆరోపణలు..

ఎన్నికల్లో టీఎంసీ పరాజయంపై స్పందిస్తూ, “ఈ పరాజయం నన్ను ఆశ్చర్యపరచలేదు. పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయినప్పుడు, అభివృద్ధి శూన్యమైనప్పుడు ఇలాగే జరుగుతుంది” అని తివారీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. “ఎవరైతే భారీ మొత్తంలో డబ్బు చెల్లించగలరో, వారికే టికెట్లు అమ్ముకున్నారు. ఈసారి కనీసం 70-72 మంది అభ్యర్థులు టికెట్ కోసం ఒక్కొక్కరు రూ. 5 కోట్లు చెల్లించారు. నన్ను కూడా అడిగారు, కానీ నేను నిరాకరించాను. అంత డబ్బు కట్టి టికెట్ తెచ్చుకున్న వారిలో ఎంతమంది గెలిచారో ఒకసారి చూడండి” అని ఆయన సవాల్ విసిరారు.

మంత్రి పదవి కేవలం ఒక ‘లాలిపాప్’..

మమతా బెనర్జీ ప్రభుత్వంలో తనకు కేటాయించిన మంత్రి పదవిపై కూడా తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాకు ఎంఓఎస్ (సహాయ మంత్రి) అనే ఒక లాలిపాప్ ఇచ్చారు, కానీ ఆ పదవికి ఎలాంటి అధికారాలు లేవు. ఏదైనా సమస్యను దీదీ (మమత) దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే, ఆమె మా మాట వినకుండానే ‘నాకు సమయం లేదు’ అని దాటవేసేవారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం తన సొంత డబ్బును కూడా ఖర్చు చేశానని, కానీ మున్సిపాలిటీ అధికారులు, పార్టీ నాయకులు సహకరించలేదని ఆరోపించారు.

క్రీడా శాఖ మంత్రిపై విమర్శలు..

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్‌పై కూడా మనోజ్ తివారీ విరుచుకుపడ్డారు. “అరూప్ దాకు క్రీడల గురించి ప్రాథమిక అవగాహన కూడా లేదు. ఆయనకు నాపై అభద్రతా భావం ఉండేది. క్రీడా కార్యక్రమాల్లో కనీసం నన్ను వేదికపైకి కూడా ఆహ్వానించేవారు కాదు. గతేడాది కోల్‌కతాలో జరిగిన మెస్సీ కార్యక్రమం ఒక గందరగోళంగా మారిందని, అందుకే నేను దానికి దూరంగా ఉన్నాను” అని వెల్లడించారు.

భవిష్యత్తు ప్రణాళిక: మళ్లీ మైదానంలోకి..

రాజకీయాలకు స్వస్తి పలికిన మనోజ్ తివారీ ఇప్పుడు మళ్లీ క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు. బీసీసీఐ లెవల్ 2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆయన, బెంగాల్ రంజీ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయాలని భావిస్తున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన ధృవీకరించారు. అవినీతి రాజకీయాల కంటే క్రీడల్లోనే తనకు గౌరవం దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *