Ravibabu: మురారి సినిమా చేశాక యాక్టింగ్ మానేద్దామని ఫిక్సయ్యా.. కుండబద్దలు కొట్టిన రవిబాబు

Ravibabu: మురారి సినిమా చేశాక యాక్టింగ్ మానేద్దామని ఫిక్సయ్యా.. కుండబద్దలు కొట్టిన రవిబాబు


మనం టీవీలోనో, వెండితెరపైనో రవిబాబుని చూడగానే ఆయన గంభీరమైన గొంతు, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ మనల్ని కట్టిపడేస్తాయి. కానీ ఒక దశలో ఆయన అసలు మేకప్ వేసుకోవడమే మానేసి, కెమెరా వెనుక ఉండి కథలు చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న మాటలు వింటే, నటుడిగా ఆయన ప్రయాణం వెనుక ఉన్న అసలు సంఘర్షణ మనకు అర్థమవుతుంది. తన తండ్రి దివంగత నటుడు చలపతిరావు గురించి మాట్లాడుతూ, ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాలో ఆయనను ఒక కొత్త కోణంలో చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని రవిబాబు గుర్తు చేసుకున్నారు. “మా నాన్నను ఆ స్థాయిలో చూడటం మాకే కొత్తగా అనిపించింది” అని ఆయన అన్నారు. కృష్ణవంశీ నటుల్లోని కొత్త కోణాన్ని బయటకు తీయడంలో దిట్ట అని, తన విషయంలో కూడా ‘మురారి’ సినిమాతో అదే జరిగిందని ఆయన వివరించారు.

నిజానికి రవిబాబు కెరీర్‌లో ‘మురారి’ ఒక మైలురాయి. ఆ సినిమా చూశాక “పర్లేదురా.. వీడికి కూడా యాక్టింగ్ వచ్చు” అని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారట. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి బోలెడన్ని అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆయన నటనకు గుడ్ బై చెప్పి దర్శకత్వం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే తన మనసులో దర్శకుడిగా మారాలనే ఆలోచనలు మొదలయ్యాయట.

నటుడిగా తనకు వచ్చే ‘స్టీరియోటైప్’ పాత్రల గురించి ఆయన చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఎవరైనా డైరెక్టర్ వచ్చి “సార్.. ఇది చాలా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది” అని చెప్పి, షూటింగ్‌కి మాత్రం “రెండు రోజులు చాలు సార్” అంటే ఆయనకు విసుగు వస్తుందట. “రెండు రోజుల్లో కథ మొత్తం నా చుట్టూ తిరగడం ఏంటి బ్రదర్?” అని ఆయన నవ్వుతూనే సెటైర్లు వేశారు. ఇలాంటి రొటీన్ పాత్రలు చేయడం వల్ల నటుడిగా తనలో అసంతృప్తి పెరిగిందని, అందుకే వందల కొద్దీ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించానని రవిబాబు స్పష్టం చేశారు. ఒకవేళ తాను దర్శకుడు కాకపోయి ఉంటే, విసుగు వచ్చినా ఆ పాత్రలు చేయాల్సి వచ్చేదని ఆయన నిజాయితీగా చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *