Headlines

ఇది తోట కాదు.. డబ్బులు పండింటే ATM.. ఏడాది పొడవునా ఆదాయం..


వ్యవసాయం ఒక సీజన్‌పై ఆధారపడి నష్టాలు పాలవుతున్న నేటి పరిస్థితుల్లో, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శేషు బాబు తన “ఏటీఎం పండ్ల తోట”తో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు జీతంతో కుటుంబ అవసరాలు తీరక ఇబ్బందులు పడిన శేషు బాబు, తన ప్రైవేట్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి, వ్యవసాయాన్ని లాభసాటి మార్గంగా మలచుకున్నారు. తన ఆరు ఎకరాల భూమిలో మొదట అర ఎకరంలో గ్యాక్ ఫ్రూట్ సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, ఒకే పంటపై ఆధారపడకుండా, వివిధ రకాల పండ్ల తోటల వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో ఏకంగా పది రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. జామ, గ్యాక్ ఫ్రూట్, లక్ష్మణ ఫలం, నిమ్మ, మామిడి, రేగు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, క్యాక్టస్, సీతాఫలం, నేరేడు, అల్లనేరేడు వంటి వివిధ రకాల పండ్లను ఆయన తోటలో చూడవచ్చు. శేషు బాబు తన తోటను “ఏటీఎం” పండ్ల తోటగా అభివర్ణిస్తారు. దీనికి కారణం, ఆయన పండించే పండ్లలో ప్రతి దానికీ ఒక నిర్దిష్ట సీజన్ ఉండటం.

ఈ విభిన్న రకాల పండ్లను ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం ద్వారా, ఒక పంట సీజన్ ముగిసేలోపే మరో పంట చేతికి అంది, ఏడాది పొడవునా నిరంతర ఆదాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, ఎండాకాలంలో మామిడి అందుబాటులో ఉంటే, జూన్ నుండి నవంబర్ వరకు డ్రాగన్ ఫ్రూట్, నవంబర్ నుండి జనవరి వరకు రేగు, జామ పండ్లు దిగుబడినిస్తాయి. నిమ్మకాయలు సంవత్సరానికి రెండు సార్లు దిగుబడినివ్వగా, గ్యాక్ ఫ్రూట్ ఏడు నెలల పాటు అధిక దిగుబడిని అందిస్తుంది. ఈ తోట ప్రత్యేకత కేవలం పంటల వైవిధ్యం మాత్రమే కాదు, దాని సాగు విధానం కూడా. శేషు బాబు రసాయన ఎరువులు, పురుగు మందులకు పూర్తిగా దూరంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా జీవామృతం, భూమిలో గొర్రెల పెంట లేదా పశువుల ఎరువులను మాత్రమే అందిస్తున్నారు. ఇది భూసారాన్ని కాపాడటమే కాకుండా, ఆరోగ్యకరమైన, రసాయన రహిత ఉత్పత్తులను అందిస్తుంది. పండ్ల మొక్కలు పెరిగి దిగుబడినిచ్చే వరకు రైతు ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే, శేషు బాబు ఈ ఖాళీ సమయాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. పండ్ల మొక్కల మధ్య ఖాళీ స్థలంలో టమాటా, గోంగూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర వంటి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఈ అంతర పంటల ద్వారా మొక్కలు పెరిగే సమయంలోనే ఆదాయం పొందుతున్నారు.

మార్కెటింగ్ విషయంలో కూడా శేషు బాబు వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నారు. పండిన పండ్లు, కూరగాయలను మధ్యవర్తులకు విక్రయించకుండా, నేరుగా రైతు బజార్ల ద్వారా వినియోగదారులకే అందిస్తున్నారు. ఇది వినియోగదారులకు తాజా, నాణ్యమైన ఉత్పత్తిని అందించడమే కాకుండా, రైతుకు మంచి ధరను కూడా కల్పిస్తుంది. ఈ ఆరు ఎకరాలకు మొత్తం 12 నుండి 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఆయన పెట్టుబడిని తిరిగి రాబట్టగలిగారు. రోజువారీ ఆదాయం మార్కెట్ డిమాండ్‌ను బట్టి రూ.2,000 నుండి రూ.10,000 వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. శేషు బాబు ఇతర రైతులకు కూడా ఒక సందేశం ఇస్తున్నారు. ఒకే పంట (మిరప, పత్తి వంటివి)పై భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే, తమకున్న సొంత పొలంలోనే అర ఎకరం లేదా ఎకరం విస్తీర్ణంలో నాలుగు ఐదు రకాల పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ “ఏటీఎం” విధానం రోజువారీ ఆదాయాన్ని అందించి, అప్పులు చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. శేషు బాబు విజయగాథ సరైన ప్రణాళికతో వ్యవసాయం ప్రతి సీజన్‌ను ఆదాయ సీజన్‌గా మార్చవచ్చని, ప్రకృతిని కాపాడుతూ రైతుకు లాభం, వినియోగదారుడికి ఆరోగ్యం అందించవచ్చని నిరూపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *