ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. డెలివరీ బాయ్స్ నేరుగా మీ ఇంటికి తెచ్చి అందిస్తారు. అయితే గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీ డిమాండ్ చేస్తూ ఉంటారు. రూ.30 నుంచి రూ.50 వరకు డిమాండ్ చేస్తూ ఉంటారు. వీటిని బలవంతంగా కస్టమర్ల నుంచి వసూలు చేస్తూ ఉంటారు. ఇవ్వకపోతే కొన్నిసార్లు వాగ్వాదానికి కూడా దిగుతూ ఉంటారు.
ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని కొంతమంది డిమాండ్ చేసే ఘటనలు మనం చూస్తూ ఉంటాం. దీంతో కస్టమర్లు రూ.50 వరకు అదనంగా సిలిండర్ డెలివరీ చేసినందుకు చెల్లిస్తూ ఉంటారు. ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా బలవంతపెట్టడంతో ఇస్తూ ఉంటారు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత ధర అయితే ఉందో అంత ధర మాత్రమే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్స్ అదనంగా అడగడం నిబంధనలకు విరుద్దం
డెలివరీ బాయ్స్ అడిగితే కస్టమర్లు ఇవ్వాల్సిన పని లేదు. గ్యాస్ ఏజెన్సీ వేర్హౌస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో డెలివరీలకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ ఉండదు. 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కొన్ని సందర్భాల్లో రూ.20 డెలివరీ చార్జీలు ఉంటాయి. అయితే ఇది గ్యాస్ బిల్లులో నమోదై ఉంటుంది. దీంతో మీ గ్యాస్ బిల్లును ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఛార్జీల వివరాలు పొందుపర్చి ఉంటాయి.
ఒకవేళ డెలివరీ బాయ్ అదనంగా అడిగితే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా సదరు గ్యాస్ ఏజెన్సీకి కంప్లైంట్ చేయాలి. అక్కడ సమాధానం రాకపోతే ఆయిల్ కంపెనీల హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 7718955555 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలి. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344, HP గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు 9222201122 నెంబర్లను సంప్రదించాలి.
ఇక ఏ వినియోగదారులు అయినా 18002333555 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక ట్విట్టర్ లేదా ఫేస్బుక్ ద్వారా మీ సమస్యను వివరిస్తూ భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ MoPNG e-Seva అధికారిక సోషల్ మీడియా అకౌంట్ @MoPNG_eSevaను ట్యాగ్ చేయాలి. ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు




