Machilipatnam Defence Project: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. మచిలీపట్నంలో కొత్త రక్షణ, యుద్ధనౌకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.8,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ తన సొంత రాష్ట్రం గోవా వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి భారీ తయారీ కేంద్రం ఇదే కానుంది. సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (SIPC) సమావేశంలో ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించింది.
400 ఎకరాల్లో ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీకి రెండు దశల్లో సుమారు 400 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. తొలి దశలో 198 ఎకరాలు, రెండో దశలో 195 ఎకరాలు కేటాయించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, మరో 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
తూర్పు తీరంలో ఎందుకు?
గోవా నుంచి కార్యకలాపాలను విస్తరించేందుకు గోవా షిప్‌యార్డ్ చాలా కాలంగా తూర్పు తీరంలో ప్రత్యామ్నాయ ప్రాంతాల కోసం పరిశీలిస్తోంది. దీనికి ప్రధాన కారణం రుతుపవనాల ప్రభావం. నౌకల తయారీ ఎక్కువగా బహిరంగ ప్రదేశంలో జరిగే ప్రక్రియ కావడంతో వర్షాకాలంలో పనులకు అంతరాయం ఏర్పడుతుంది.
గోవాలో వర్షాకాలం ప్రారంభమైన సమయంలో నౌకల తయారీ కార్యకలాపాలు నిలిచిపోతాయని, తూర్పు తీరంలో కొత్త కేంద్రం ఏర్పాటు చేస్తే రెండు ప్రాంతాల్లో రుతుపవనాల సమయాల్లో ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని కార్యకలాపాలను కొనసాగించవచ్చని కంపెనీ అధికారులు చెబుతున్నారు.
2028లో ఉత్పత్తి ప్రారంభం
ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో పర్యావరణ ప్రభావ అంచనా (EIA), డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీ వంటి పనులు ఉంటాయి. వచ్చే ఏడాది అక్టోబర్‌లో యంత్రాల ఏర్పాటును ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. 2028 జనవరిలో ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. మొదటి దశలో వాణిజ్య ఉత్పత్తి 2028 మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండో దశ పనులను 2028 డిసెంబర్‌లో ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ కేంద్రంలో 120 మీటర్ల పొడవు, ఆరు మీటర్లకు పైగా డ్రాఫ్ట్ ఉన్న నౌకలను నిర్మించనున్నారు.
రూ.1,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు..
మచిలీపట్నంలో ప్రాజెక్ట్ ఏర్పాటుపై గోవా షిప్‌యార్డ్ 2025 ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది. 2025 నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన రెండు రోజుల CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ రంగ PSU మధ్య అవగాహన ఒప్పందం (MoU) కూడా కుదిరింది.
అయితే అప్పట్లో ప్రతిపాదించిన పెట్టుబడి కేవలం రూ.1,500 కోట్లు కాగా.. ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టుబడి భారీగా పెరిగి రూ.8,000 కోట్లకు చేరింది. దీంతో మచిలీపట్నం రక్షణ, నౌకా నిర్మాణ రంగంలో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.