Headlines

అయ్యో దేవుడా.. గాలి వాన ఎంత పనిచేసింది.. పాపం రేవతి..

అయ్యో దేవుడా.. గాలి వాన ఎంత పనిచేసింది.. పాపం రేవతి..


అకస్మాత్తుగా వీచిన గాలివాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు, జోరు వాన కలిసి ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేపింది. గాలులు బీభత్సానికి మక్కువ మండలం నగుళ్లులో మువ్వల రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, పది మేకలు కూడా మృతి చెందాయి. రేవతి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తుంది. అందరితో కలివిడిగా ఉంటూ తన ఉన్నతాధికారులతో పాటు గ్రామస్తులు వద్ద కూడా మంచి పేరు తెచ్చుకుంది. నిరంతరం కష్టపడి పనిచేసుకొని తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఓ వైపు కమ్యూనిటీ హెల్త్ వర్కరుగా పనిచేస్తూ పని అయినపోయిన తరువాత జీవనోపాధి కోసం మేకలను పెంచుతుంటుంది. వాటిని తరచూ మేతకు కూడా తీసుకెళ్లేది. అలా ఎప్పటిలాగే సాయంత్రం మేకల షెడ్డు దగ్గరకు వెళ్లిన ఆమె.. ఎంత సమయం అయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు.

అదే సమయంలో గ్రామ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు తీవ్రంగా వీచడంతో గ్రామంలో ఉన్న రేవతికి చెందిన మేకల షెడ్డు కూలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న రేవతి తీవ్రంగా గాయపడింది. అందులో ఉన్న ఐదు మేకలు కూడా అక్కడికక్కడే చనిపోయాయి.

వర్షం తగ్గిన తరువాత స్థానికులు రేవతి కోసం అక్కడికి వెళ్లారు. అప్పటికే రేవతి అపస్మారక స్థితిలో ఉండటం గుర్తించి వెంటనే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రేవతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇదే గాలివాన ప్రభావంతో గ్రామానికి చెందిన పువ్వల చిన్నప్పకు చెందిన మరో మేకల శాలలో ఐదు మేకలు కూడా మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *