Weather Update: వచ్చే నాలుగు రోజులు ఎండలే ఎండలు

Weather Update: వచ్చే నాలుగు రోజులు ఎండలే ఎండలు


తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో మాడుపగిలేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్దిరోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండల దెబ్బకి వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుస్తున్నారు. మధ్యాహ్నం ఎండ వేడికి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.ఏప్రిల్‌ నెలలోనే ఈ విధంగా ఎండ ప్రభావం వుంటే, మే నెలలో ఏ విధంగా వుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్య నిపుణులూ సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని.. వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 95 మండలాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. బుధవారం కడపలో అత్యధికంగా 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 44.1 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాలకు వెళ్లిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. చెట్ల కింద నిలబడరాదని సూచించారు. రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మే నెలలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగి, గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ సూచనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, తారు రోడ్ల పై నమోదయ్యే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలను మించే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో, ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటు తెలంగాణలో భానుడు ప్రతాపం కొనసాగుతుండగా, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడుపై నుంచి ఆవరించిన ద్రోణి ప్రభావం రాబోయే నాలుగు రోజులూ తెలంగాణలో ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని ఒకటి లేదా రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం వేళకు వాతావరణం చల్లబడి, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో వడగాలుల తీవ్రత వల్ల తెలంగాణలో బుధవారం ఏడుగురు మృతి చెందారు. శుక్రవారం నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటాయని, ఇక్కడ 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచానా వేసింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వేసవిలో ఎండలు, వడగాలుల తీవ్రతకు శరీరంలో నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటి పానియాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఐస్​క్రీంలు, కూల్​ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్గర్లు, ఫ్రైడ్​ రైస్​లు లాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాలనుగుణంగా మార్కెట్​లో లభించే తాజా పండ్లను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని వివరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *