ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వానలు పడుతున్నాయి. ఉన్నట్లుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే మూడ్రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశముంది. ఎండలతో పాటు అకాల వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉపరితల గాలులు దక్షిణం లేదా నైరుతి వైపు వీచే అవకాశముంది. ఏప్రిల్ 28న ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. ఇక నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీకి వాతావరణశాఖ అలర్ట్
ఏప్రిల్ 29న నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 3వ తేదీ వరకు పలుచోట్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఏపీలో చూస్తే.. ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో 30వ తేదీ వరకు వానలు పడతాయని స్పష్టం చేసింది. అటు ఏపీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వేడిగాలులు, ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు.