Headlines

Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు.. నటుడు మాధవన్ టెర్రస్ గార్డెన్ సీక్రెట్స్ తెలిస్తే..


నటనలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. కొద్దిపాటి బాల్కనీ లేదా టెర్రస్ ఉంటే చాలు.. ఎవరైనా కెమికల్స్ లేని తాజా కూరగాయలను సొంతంగా పండించుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ముంబైలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న ఆయన, తమిళనాడులో భారీ కొబ్బరి తోటను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2014లో బాల్కనీలో చిన్నపాటి కుండీలతో ప్రారంభమైన మాధవన్ వ్యవసాయ ప్రయాణం నేడు ఆయన జీవనశైలిలో కీలక భాగమైంది. మార్కెట్లో దొరికే కూరగాయలలో పోషకాల కొరత, రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాల వాడకం చూసి చలించిన ఆయన సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒక సినిమా స్క్రిప్ట్ చర్చల కోసం ఇంట్లో ఎక్కువ సమయం గడిపిన సమయంలో సేంద్రియ వ్యవసాయంపై అధ్యయనం చేసి ఆచరణలో పెట్టారు. ప్రస్తుతం తన కుటుంబానికి అవసరమైన కాలానుగుణ కూరగాయలలో దాదాపు 70 శాతాన్ని తన ఇంటి టెర్రస్ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే కేవలం 20వ వంతు నీటిని మాత్రమే ఉపయోగిస్తూ ఆధునిక పద్ధతుల్లో ఈ దిగుబడి సాధిస్తుండటం విశేషం.

టమాటాల నుంచి బ్రోకలీ వరకు రకరకాల పంటలు

మాధవన్ తన టెర్రస్‌పై వంకాయ, బ్రోకలీ, టమాటాలు, దోసకాయలతో పాటు పలు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. తాము తినే ఆహారాన్ని తామే పండించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయన.. తమిళనాడులోని నిరుపయోగంగా ఉన్న బంజరు భూములను సారవంతమైన కొబ్బరి తోటలుగా మార్చి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వయంగా మొక్కను నాటి పెంచినప్పుడే రైతు పడే కష్టం విలువ నిజంగా తెలుస్తుందని మాధవన్ తెలిపారు.

ఇంట్లోనే సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వారికి మాధవన్ కీలక సూచనలు

నాణ్యమైన నేల: మొక్కలు దృఢంగా ఎదగడానికి సాధారణ మట్టితో పాటు నదీతీరపు ఒండ్రు మట్టి మిశ్రమాన్ని వాడటం మంచిది.

సేంద్రియ, దేశీ విత్తనాలు: హైబ్రిడ్ విత్తనాలకు బదులుగా గ్రామాల్లోని రైతుల వద్ద లభించే సంప్రదాయ దేశీయ విత్తనాలు లేదా నాణ్యమైన సేంద్రియ విత్తనాలను ఎంచుకోవాలి. ఇవి ఆన్‌లైన్‌లోనూ లభిస్తాయి.

తగినంత సూర్యరశ్మి: విత్తనం మొలకెత్తిన తర్వాత మొక్క ఆరోగ్యంగా పెరగడానికి రోజుకు కనీసం 5-6 గంటల ఎండ తగలడం తప్పనిసరి.

గాలి ప్రసరణ: మూసివున్న గదుల్లో కాకుండా గాలి ధారాళంగా ఆడే ప్రదేశాల్లోనే కుండీలను అమర్చుకోవాలి.

నీటి యాజమాన్యం: అధికంగా నీరు పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. మట్టిలో తేమను గమనించి అవసరమైనప్పుడు మాత్రమే నీరందించాలి.

తెగుళ్లు, ఎలుకల నుంచి రక్షణ: విత్తనాలు నాటిన ప్రారంభ దశలో ఎలుకలు, పురుగులు నారును నాశనం చేయకుండా నెట్స్ లేదా మూతలతో కప్పి రక్షించుకోవాలి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *