Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. 400 పరుగులు.. తగ్గేదే లే అంటున్న వైభవ్ సూర్యవంశీ.. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ కు షాక్

Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. 400 పరుగులు.. తగ్గేదే లే అంటున్న వైభవ్ సూర్యవంశీ.. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ కు షాక్


Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, పాయింట్ల పట్టికతో పాటు ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డుల్లోనూ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అత్యధిక పరుగులు చేసి బ్యాటర్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం జరుగుతున్న పోరాటం పతాక స్థాయికి చేరింది. ప్రతి మ్యాచ్ తర్వాత ఈ క్యాప్ ఒకరి తల మీద నుంచి మరొకరి వద్దకు మారుతోంది. అయితే తాజాగా జరిగిన పోరులో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సత్తా చాటి కోహ్లీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐపీఎల్ 2026 టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన సెంచరీ (103 పరుగులు) బాదినప్పుడే అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మధ్యలో కొందరు ప్లేయర్లు అతడిని అధిగమించినప్పటికీ, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మళ్లీ తన ఆరెంజ్ క్యాప్‎ను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో 400 పరుగుల మార్కును చేరుకున్న తొలి బ్యాటర్‌గా వైభవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీ 9 ఇన్నింగ్స్‌లలో 400 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని వెనుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ అభిషేక్ శర్మ 380 పరుగులతో రెండో స్థానంలో గట్టి పోటీ ఇస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (358 పరుగులు) మూడో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ 351 పరుగులతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఐదో స్థానంలో ఎస్ఆర్‌హెచ్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ (349 పరుగులు) ఉన్నాడు. ఈ ఐదుగురి మధ్య కేవలం కొన్ని పరుగుల తేడా మాత్రమే ఉండటంతో రేసు రసవత్తరంగా మారింది.

గణాంకాల ప్రకారం చూస్తే, విరాట్ కోహ్లీ సగటు ఈ జాబితాలో ఉన్న వారందరికంటే ఎక్కువగా ఉంది. 58.50 సగటుతో కోహ్లీ స్థిరంగా పరుగులు చేస్తున్నప్పటికీ, వైభవ్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్నారు. కోహ్లీ మళ్లీ ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవాలంటే తన తర్వాతి మ్యాచ్‌లో కనీసం హాఫ్ సెంచరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైభవ్, కోహ్లీ మధ్య 49 పరుగుల తేడా ఉంది. వచ్చే మ్యాచుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది.

ఒకప్పుడు ఐపీఎల్ అంటే విదేశీ ఆటగాళ్లు లేదా టీమిండియా సీనియర్ల హవా నడిచేది. కానీ 2026 సీజన్ చూస్తుంటే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత ఒత్తిడిని తట్టుకుంటూ 400 పరుగులు సాధించడం అసాధారణ విషయం. ఈ ఆరెంజ్ క్యాప్ పోరాటం ముగిసేసరికి ఎవరు పీఠం దక్కించుకుంటారో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *