Tirumala Theerthalu Story Telugu: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయం కూడా. శేషాచల పర్వతశ్రేణుల్లో మొత్తం 66 కోట్ల తీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కాందపురాణం పేర్కొంటున్నాయి. ఈ తీర్థాల్లో స్నానమాచరించడం, వాటిని సేవించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ తీర్థాలను ధర్మరతిప్రద, జ్ఞానప్రద, భక్తి వైరాగ్యప్రద, ముక్తిప్రద అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
- ధర్మరతిప్రద తీర్థాలు: ఈ తీర్థాల సమీపంలో నివసించడం, స్నానమాచరించడం, సేవించడం వల్ల ధర్మంపై ఆసక్తి పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. వీటి సంఖ్య 1,008గా పేర్కొనబడింది.
- జ్ఞానప్రద తీర్థాలు: ఈ తీర్థాలు మొత్తం 108 ఉన్నాయని పురాణాలు వివరిస్తున్నాయి. వీటి జలాలను సేవించడం వల్ల జ్ఞానయోగం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. మను, ఇంద్ర, వసు, రుద్ర, ఆదిత్య, ప్రజాపతి, అశ్విని, నారద, సోమ, ధర్మ, గణేశ్వర, కార్తికేయ, గరుడ, శేష, వాసుకి, వాసుదేవ, నారాయణ, గోముఖ, ఆంజనేయ, అష్టభైరవ తదితర తీర్థాలు ఈ విభాగంలో ఉన్నాయి.
- భక్తి వైరాగ్యప్రద తీర్థాలు: జ్ఞానప్రద తీర్థాల కంటే ఇవి మరింత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీటిని సేవించడం వల్ల పాపవిముక్తి, సంసారంపై వైరాగ్యం, దైవభక్తి కలుగుతాయని నమ్మకం. ఈ విభాగంలో మొత్తం 68 తీర్థాలు ఉన్నాయి. చక్ర, వజ్ర, నారసింహ, బ్రహ్మ, అగ్ని, గౌతమి, భైరవ, పాండవ, లక్ష్మి, విష్ణు, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార, తుంబురు తదితర తీర్థాలు ఇందులో ప్రముఖమైనవి.
ముక్తిప్రద తీర్థాలు:
తిరుమలలోని అన్ని తీర్థాల్లో అత్యంత విశిష్టమైనవి ముక్తిప్రద తీర్థాలు. ఇవి మొత్తం ఏడు. వీటిని సేవించడం వల్ల ముక్తి లభిస్తుందని పురాణ ప్రశస్తి.
- శ్రీస్వామి పుష్కరిణి: శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ తీర్థాన్ని తీర్థరాజంగా పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వంటి సందర్భాల్లో ఇక్కడ జరిగే చక్రస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
- కుమారధార: కుంభమాసంలో మఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఈ తీర్థస్నానానికి విశేషమైనది.
- తుంబురు తీర్థం: మీనమాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి అపరాహ్ణ సమయంలో ఇక్కడ స్నానం చేయడం విశిష్టమైనదిగా భావిస్తారు.
- రామకృష్ణ తీర్థం: మకర మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఈ తీర్థానికి ముఖ్యమైన పర్వదినం.
- ఆకాశగంగ: మేషమాసంలో చిత్రా నక్షత్రంతో కూడిన పౌర్ణమికి ఈ తీర్థంలో స్నానమాచరించడం శుభప్రదంగా చెబుతారు.
- పాపవినాశనం: ఆశ్వయుజ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన శుక్ల సప్తమి ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన ద్వాదశి ఈ తీర్థానికి విశేషమైన రోజులు.
- పాండవ తీర్థం: దీనినే గోగర్భ తీర్థం అని కూడా పిలుస్తారు. వృషభమాసంలో శుద్ధ ద్వాదశి ఆదివారం లేదా బహుళ ద్వాదశి మంగళవారం ఈ తీర్థస్నానానికి పర్వదినాలుగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఏడు ముక్తిప్రద తీర్థాల్లో స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ తీర్థాలకు ప్రతి సంవత్సరం ముక్కోటి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇలా తిరుమల కొండలు ప్రకృతి అందాలతో పాటు అపారమైన ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టత కలిగిన పవిత్ర తీర్థాలకు నిలయంగా విరాజిల్లుతున్నాయి.
(Disclaimer: తీర్థాల సంఖ్యలు, వాటి విశిష్టతలు, పర్వదినాల వివరాలు పురాణ సంప్రదాయాల ఆధారంగా ఇవ్వబడ్డాయి.)