అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. చెన్నై కేంద్రంగా శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న భారీ మాదకద్రవ్యాల గుట్టును రట్టు చేశారు. ఈ ఏడాదిలోనే అత్యధికంగా సుమారు రూ.710 కోట్ల విలువైన 71.24 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో DRI అధికారులు నవంబర్ 17, 18 తేదీల్లో చెన్నైలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా చెన్నైని ట్రాన్సిట్ పాయింట్‌గా మార్చుకుని, తిరుచిరాపల్లి మీదుగా సముద్ర తీర ప్రాంతం ద్వారా శ్రీలంకకు హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ వేసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో 69 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 71.24 కేజీల హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.700 కోట్ల నుంచి రూ.710 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్.. వాహనాలు సీజ్
డ్రగ్స్ తరలిస్తున్న వాహనంతో పాటు దానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న ఒక టూవీలర్‌ను కూడా DRI అధికారులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమిళనాడుకు చెందిన అబ్దుల్ షుకూర్, షఫీక్ అహ్మద్‌గా గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం-1985 నిబంధనల ప్రకారం డ్రగ్స్, వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ముఠా మూలాలపై ఆరా..
ఈ భారీ డ్రగ్స్ ఎక్కడి నుంచి చెన్నైకి చేరాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్ ఏంటి? అనే కోణంలో DRI అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ చేరవేసే ముఠా మూలాలను పెకిలించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
👉 DRI seizes over 71 kg heroin being smuggled to Sri Lanka; two drug traffickers arrested in Chennai
👉 Seizure is single largest in India during 2026
Read more ➡️ https://t.co/v1TJKGfR3j
#DRIAtWork https://t.co/uMHCUaCIAU
— Ministry of Finance (@FinMinIndia) November 19, 2026