Headlines

Telangana: ఎల్‌నివో ఎఫెక్ట్.. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ముప్పు.. రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు..?


రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ముంచుకొస్తున్నాయి. ఒకవైపు కరెంటు డిమాండ్ ఆల్‌టైమ్‌ హైకి చేరుతుంటే.. మరోవైపు కీలక విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తికి బ్రేకులు పడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం.. జల విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం.. థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత.. ఈ పరిణామాలన్నీ కలిసొస్తే తెలంగాణ పవర్‌ సిస్టమ్‌పై ఎంత ఒత్తిడి పడుతోంది. ఎల్‌నివో‌తో రానున్న రోజుల్లో తెలంగాణకు కరెంట్‌ కష్టాలు తప్పేటట్టు లేదు.

పవర్‌ డిమాండ్‌.. ఆల్‌టైమ్‌ హై..

ఎల్‌నివో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. అదే స్థాయిలో తెలంగాణలో కరెంట్‌ డిమాండ్‌ దూసుకెళ్తోంది.. రికార్డు స్థాయిలో విద్యుత్‌ అవసరం పెరుగుతోంది. కానీ అదే సమయంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు బొగ్గు కొరతతో థర్మల్‌ ప్లాంట్లు ఉక్కిరిబిక్కిరి.. మరోవైపు వర్షాభావంతో జల విద్యుత్‌కు గండంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 19,543 మెగావాట్ల ఆల్‌టైమ్‌ హైని తాకింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 15,906 మెగావాట్లతో పోలిస్తే ఇది దాదాపు 23 శాతం అధికంగా ఉంది. సాధారణంగా సెప్టెంబర్ లో డిమాండ్‌ కొంత తగ్గాల్సి ఉన్నా.. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఉక్కపోత కారణంగా ఏసీల వినియోగం కొనసాగడం కూడా వినియోగాన్ని పెంచుతోంది. ఇక్కడే అసలు టెన్షన్‌ మొదలైంది. డిమాండ్‌ పెరుగుతున్న సమయంలోనే రాష్ట్రంలోని కొన్ని కీలక విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడం పవర్‌ సిస్టమ్‌పై అదనపు ఒత్తిడిని పెంచుతోంది.

విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కష్టాలు…

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై చేయాల్సిన పవర్ ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మొత్తం మూడు థర్మల్, రెండు హైడల్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు కొరత పెద్ద శాపంగా మారింది. బొగ్గు రాక.. ప్లాంట్లు నడవక.. యాదాద్రిలో ఏకంగా రెండు యూనిట్లను మూసివేయాల్సి వచ్చింది. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఏకంగా 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. ప్రధానంగా నాణ్యమైన బొగ్గు సరఫరా కాకపోవడమే ఉత్పత్తికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. ఇటు చూస్తే కేటీపీఎస్, అటు చూస్తే బీటీపీఎస్ ప్లాంట్లు కూడా బొగ్గు దొరక్క తంటాలు పడుతున్నాయి. ఇక భద్రాద్రి ప్లాంట్ కథ మరీ దారుణం! ఇక్కడ బొగ్గు సమస్యకు తోడు.. నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలు తోడయ్యాయి. ఫలితంగా 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి పవర్ ప్లాంట్ లో రెండు కీలక యూనిట్లు మూత పడ్డాయి. దీంతో మరో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి పడింది. 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు తవ్వకాలు తగ్గిపోవడంతో అక్కడ కూడా ఉత్పత్తి పడిపోయింది. వారంలోనే రాష్ట్రంలోని మూడు థర్మల్‌, రెండు హైడల్‌ యూనిట్లలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మూడు థర్మల్‌ యూనిట్లకే కలిపి సుమారు 1,870 మెగావాట్ల ఉత్పత్తి ప్రభావితమైంది.

జల విద్యుత్‌కూ ఎల్‌నినో దెబ్బ..

థర్మల్ ప్లాంట్ల పరిస్థితి ఇలా ఉంటే.. జల విద్యుత్ (హైడల్) ప్రాజెక్టులను ఎల్ నినో ఎఫెక్ట్ నిలువునా ముంచేసింది. వర్షాలు లేక రిజర్వాయర్లలో నీటి ఎద్దడి తీవ్రమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతోంది. ఎప్పుడూ పీక్ డిమాండ్ టైంలో ఆదుకునే హైడల్ పవర్.. ఈసారి చేతులెత్తేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. 810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ లో ప్రస్తుతం పీక్ డిమాండ్ టైంలో 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలంలో ప్రస్తుతం పీక్ డిమాండ్ టైంలో 8.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల ప్రాజెక్టులో ఆశించడం స్థాయిలో నీరు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేశారు.

పవర్ క్రైసిస్ పై పొలిటికల్ వార్..

పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పవర్ వార్ సాగుతోంది. విద్యుత్ కష్టాలన్నీ గత ప్రభుత్వానివేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల పాలు చేసిందని, నాసిరకం ప్లాంట్ల నిర్మాణం మరియు నిర్వహణ లోపాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. యాదాద్రి ప్లాంట్ ఆలస్యానికి, సింగరేణిపై ఉన్న బకాయిలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని కొట్టిపారేస్తున్నారు. బొగ్గు కొరత, ఎల్ నినో పరిస్థితులు అంటూ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తమ హయంలోనే 21వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి రంగం సిద్ధం చేశామని అంటున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ దృష్టి..

ఈ పవర్ షాక్ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై ముమ్మరంగా దృష్టి సారించింది. ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు గనుల నుంచి యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు సరఫరాను అత్యంత వేగంగా పెంచాలని సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో అవసరమైతే పవర్ ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి డిమాండ్‌ను అందుకోవాలని డిస్కాంలు ప్లాన్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం ఇలాగే కొనసాగితే, విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి కత్తిమీద సామే కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *