Headlines

Telangana: ఆ తండ్రి బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు.. త్వరలోనే కూతురి పెళ్లి.. ఇంతలోనే


ఓ తండ్రి తన కూతురి పెళ్లి గురించి ఎన్నో కలలు కంటాడు. ఆడపిల్లను అత్తవారింటికి సంతోషంగా సాగనంపాలని ఆశపడతాడు. అందుకోసం తన శక్తికి మించి కష్టపడతాడు. రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెడతాడు. పెళ్లి కోసం కావాల్సిన వస్తువులను ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటాడు. కానీ.. ఆ తండ్రి కష్టమంతా ఒక్క అగ్నిప్రమాదంతో బూడిదైతే.. ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతం. అచ్చం ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లా బాసరలో వెలుగు చూసింది. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం కాలి బూడిదై పోయింది.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం కుటుంబంలో కూతురి పెళ్లి సందడి మొదలుకావాల్సిన సమయంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున విద్యుత్ ఘాతంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లోని వస్తువులన్నీ మంటలకు ఆహుతయ్యాయి. మంటల నుంచి ఏ వస్తువునూ కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ ప్రమాదంలో కాలిపోయింది కేవలం ఇంట్లోని వస్తువులే కాదు.. ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న ఆశలు కూడా. వివాహ ఖర్చుల కోసం ఇంట్లో భద్రపరిచిన పది లక్షల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. కొత్తగా కొనుగోలు చేసిన ఫర్నిచర్, విలువైన దుస్తులు సైతం కాలి బూడిదయ్యాయి.

కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కళ్లముందే కాలిపోతుంటే ఆ తండ్రి గుండె ఎంత విలవిలలాడిందో.. మాటల్లో చెప్పలేం. ఎన్నో రోజుల కష్టం.. ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు.. ఒక్కసారిగా మంటల్లో కలిసిపోయాయి. కూతురిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి, సంతోషంగా అత్తవారింటికి పంపించాలన్న ఆశకు అగ్నిపరీక్ష ఎదురైంది. పెళ్లి కోసం సిద్ధం చేసిన నగలు, నగదు, వస్తువులు ఏవీ మిగలకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాసర సీఐ దీపక్ ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఇప్పుడు బాధిత కుటుంబం కన్నీటి రోదనలు వినిపిస్తున్నాయి. కూతురి పెళ్లి కోసం దాచిన సొమ్ము బూడిద కావడంతో ఆ తండ్రి భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాడు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి దాతలు, ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియో చూడండి..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *