Sunrisers Hyderabad vs Chennai Super Kings: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో ఇరు జట్ల ప్రయాణం ఒడిదుడుకులతోనే సాగింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో రెండు జట్లు చెరో నాలుగు పాయింట్లతో ఉన్నాయి. అయితే, నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం సన్‌రైజర్స్ (+0.576) మెరుగైన స్థితిలో ఉండి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు చెన్నై (-0.846) ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానాల వైపు దూసుకెళ్లాలని భావిస్తోంది.
ముఖాముఖి పోరులో చెన్నై ఆధిపత్యం..
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటాలను గమనిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. మొత్తం 22 సార్లు తలపడగా, చెన్నై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. హైదరాబాద్ కేవలం 7 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, గత ఆరు మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే ఇరు జట్లు 3-3తో సమంగా ఉన్నాయి. 2025 సీజన్లో జరిగిన ఏకైక పోరులో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. దీంతో నేటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
జట్ల బలాబలాలు.. కీలక ఆటగాళ్లు..
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో సతమతమవుతోంది. వేగవంతమైన బౌలర్ ఖలీల్ అహ్మద్ దూరం కావడంతో ముఖేష్ చౌదరి జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, డెవాల్డ్ బ్రెవిస్ మంచి ఫామ్‌లో ఉండటం వారికి కలిసివచ్చే అంశం. ఇక మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి వస్తారా లేదా అన్నది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు ‘ఆరెంజ్ ఆర్మీ’ హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నిలకడలేమి జట్టును కలవరపెడుతోంది. బౌలింగ్‌లో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో హైదరాబాద్‌కు ప్రేక్షకుల మద్దతు మెండుగా ఉండనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు పాయింట్ల పట్టికలో టాప్-4లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. చెన్నై అనుభవం, హైదరాబాద్ దూకుడు మధ్య జరిగే ఈ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..