చాలా కాలం తర్వాత టాలీవుడ్ మాస్ హీరో రవితేజ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇరుముడి. కొన్నాళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు ఈ మూవీ సరైన బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలోనే కాకుండా ఇటీవల ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. అయితే, సినిమాలో ఊరి నేపథ్యంలో అంత పెద్ద క్రైమ్ యాంగిల్ జరిగినా, ఎక్కడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లేదా ఎస్సై ఎంక్వైరీ పాత్రలు కనిపించకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే వివరణ ఇచ్చారు. సినిమాలో పోలీస్ లేయర్‌ను కావాలనే పక్కన పెట్టానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.
“ఒకవేళ సీన్‌లోకి ఎస్సై వచ్చి ఎంక్వైరీ మొదలుపెడితే, ప్రేక్షకులు పాత్రల తాలూకు అంతర్మథనం, వారి భావోద్వేగ ప్రయాణాన్ని ఆస్వాదించడం మానేస్తారు. ‘నేరం వెనుక ఎవరున్నారు? పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు?’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోణంలోనే ఆలోచించడం మొదలుపెడతారు. దీంతో కథలోని అసలు ఎమోషన్ దెబ్బతింటుంది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, సినిమాలో నేరాలకు కారణమైన వ్యక్తి పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే అని, అతడు పోలీసులను రాకుండా తన అధికారాన్ని ఉపయోగించాడా లేదా అనే లీగల్ ప్రొసీజర్ మొత్తాన్ని 2 గంటల 20 నిమిషాల నిడివిలో చూపించడం అసాధ్యమని తెలిపారు.
తాను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన భావోద్వేగాన్ని అందించాలనుకున్నానని, క్రైమ్ డ్రామాగా మార్చి లీగల్ అంశాలతో ఆడియన్స్ దృష్టిని పక్కదారి పట్టించడం ఇష్టం లేకే పోలీస్ సీన్లను ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. కథలోని ఎమోషనల్ డెప్త్‌ను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడంతో, ఈ పోలీస్ సీన్ల వివాదానికి దర్శకుడు పూర్తి ముగింపు పలికారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..