Headlines

Sandalwood Smuggling: పైకి చూస్తే పేపర్ లామినేట్ రోల్స్.. లోపల చెక్‌ చేయగా.. కళ్లు చెదిరే సీన్


భారత్ లో అంతరించిపోతున్న వృక్ష జాతుల జాబితాలో ఉన్న ఎర్ర చందనం యదేచ్ఛగా విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది. తాజాగా చెన్నై నుంచి మలేషియాకు భారీగా స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు చెన్నై పోర్టులో పట్టుకున్నారు. పేపర్ లామినేట్ రోల్స్ పేరుతో కంటైనర్‌లో దాచి పంపిస్తున్న సుమారు 12.87 మెట్రిక్ టన్నుల అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.7.72 కోట్లు ఉంటుందని అధిరాలు తెలిపారు.

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నవంబర్ 9 నుంచి 11 వరకు చెన్నై పోర్టులో DRI అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఎర్రచందనం దుంగలతో ఉన్న కంటైనర్ ను ఓడలోకి ఎక్కించే ముందే DRI అధికారులు అడ్డుకున్నారు. స్మగ్లర్లు ఈ కంటైనర్‌ను పేపర్ లామినేట్ రోల్స్ గా ప్రకటించారు. అయితే తనిఖీలో కంకర రాళ్లు, తక్కువ మొత్తంలో పేపర్ లామినేట్ రోల్స్ సరుకుతో పాటు అధిక నాణ్యత గల ఎర్రచందనం దుంగలు దాచి ఉంచినట్లు గుర్తించారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఎర్రచందనం కార్గోను స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో స్మగ్లర్లు మాన్యుఫ్యాక్చరర్-ఎక్స్ పోర్టర్ కి అందుబాటులో ఉన్న సెల్ఫ్-సీలింగ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఎగుమతిదారు ద్వారా కంటైనర్ ఏర్పాటు చేసి, దాన్ని ప్రైవేట్ గోదాముకు తీసుకెళ్లి అక్కడ పేపర్ లామినేట్ రోల్స్‌ను తీసివేసి వాటి స్థానంలో ఎర్రచందనం దుంగలను నింపి మలేషియాకు పంపే ప్రయత్నం చేశారు. గోదాములో జరిపిన సోదాల్లో పేపర్ లామినేట్ రోల్స్ , తూకం యంత్రం, ఎర్రచందనం ఆనవాళ్లు లభించాయి.

ఈ కేసులో సిండికేట్‌కు చెందిన ముగ్గురు కీలక సభ్యులను కస్టమ్స్ చట్టం కింద అరెస్టు చేశారు.ఎర్రచందనం అంతరించిపోతున్న వృక్ష జాతుల జాబితాలో ఉంది. విదేశీ వాణిజ్య విధానం ప్రకారం భారతదేశం నుంచి ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం ఉంది.ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను నిర్మూలించి దేశ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు DRI కట్టుబడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *