బంగారం.. ఈ పేరు వింటేనే భారతీయుల కళ్లు మెరుస్తాయి. ఆడపడుచుల అలంకారమైనా, కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడైనా మనకు బంగారం తర్వాతే ఏదైనా. అయితే, ప్రస్తుతం పసిడి మార్కెట్‌లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు కేవలం మూడు నెలల్లోనే భారతీయులు ఏకంగా 151 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనం నగలు కొనడం తగ్గించి, పెట్టుబడి వైపు మొగ్గు చూపుతున్నాం. అసలు మార్కెట్‌లో ఏం జరుగుతోంది? సాధారణంగా భారతీయులు పెళ్లిళ్లు, పండుగలకు నగలు చేయించుకుంటారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. బంగారంపై పెట్టుబడుల జోరు అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పెట్టుబడి రూపంలో కొనుగోళ్లు 54% పెరిగి 82 టన్నులకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.68,100 కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ, ఇప్పుడు ఏకంగా రూ.99,900 కోట్లకు చేరింది. అంటే దాదాపు 47% పెరుగుదల! ఆభరణాల గిరాకీ తగ్గిపోయింది. అధిక ధరల వల్ల కావచ్చు లేదా మారుతున్న ఆలోచనా విధానం వల్ల కావచ్చు.. ఆభరణాల గిరాకీ 19% తగ్గి 66 టన్నులకు పరిమితమైంది. మునుపటిలా కాకుండా, ఇప్పుడు ప్రజలు ‘తరుగు’, ‘మజూరి’ వంటి అదనపు ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం వైపు వెళ్తున్నారు. బిస్కెట్లు & నాణేలకు గిరాకీ పెరిగిపోయింది. 2013 తర్వాత వీటి గిరాకీ అత్యధిక స్థాయికి చేరి 62 టన్నులుగా నమోదైంది. దీని విలువ రూ.94,100 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. అలాగే డిజిటల్ బంగారంపై నమ్మకం పెరుగుతోంది. ఈ మూడు నెలల్లోనే 20 టన్నుల నికర గిరాకీ కనిపించింది. ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ఉండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ను సురక్షితమైనా దారిగా భావిస్తున్నారు. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పసిడి గిరాకీ 2% పెరిగి 1231 టన్నులకు చేరింది. ధరల పెరుగుదల ఉన్నా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. 2025లో ఔన్సు బంగారం ధర 2860 డాలర్లు ఉంటే, ఇప్పుడు అది 81% పెరిగి 4873 డాలర్లకు చేరింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం 244 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇందులో మన భారత రిజర్వ్ బ్యాంక్ వాటా కూడా గణనీయంగా ఉంది. WGC నివేదిక ప్రకారం 2026 సంవత్సరం గోల్డ్ మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాది మొత్తం 650 నుండి 750 టన్నుల గిరాకీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. ముఖ్యంగా పెట్టుబడుల వాటా 41% వరకు ఉండే అవకాశం ఉంది. 2000 సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత వాటా 13% గా ఉండటం విశేషం. ధరలు పెరగడంతో చాలా మంది తమ పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటున్నారు. ఈ మార్పిడి 20% పెరిగి 31.2 టన్నులకు చేరింది. మరోవైపు దేశీయ అవసరాల కోసం దిగుమతులు కూడా 39% పెరిగి 186 టన్నులకు చేరుకున్నాయి. పసిడి ధరలు పెరుగుతున్నా, సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరూ బంగారంపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. అక్షయ తృతీయ సెంటిమెంట్, పెళ్లిళ్ల సీజన్ రాబోతుండటంతో ఈ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. నగలు చేయించుకోవడం కంటే, భవిష్యత్తు కోసం బంగారాన్ని ఒక ఆస్తిగా దాచుకోవడమే మేలని ప్రజలు భావిస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన డాలర్ ఆధిపత్యం ఇప్పుడు బీటలు వారుతోంది. దీనికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను తమ ఆర్థిక భద్రత గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘బంగారం’ మళ్లీ తెరపైకి వచ్చింది. జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ విశ్లేషణ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది: “బంగారం ధర 8,000 డాలర్లకు చేరుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే బంగారం దాచుకోవడం బెస్ట్ అనే ఆలోచనలోకి మదుపుదారులు వస్తున్నారంటున్నారు నిపుణులు. అమెరికా తన డాలర్‌ను ఒక ‘ఆర్థిక ఆయుధం’గా వాడుతోందని రష్యా, చైనా వంటి దేశాలు భావిస్తున్నాయి. రష్యాపై విధించిన ఆంక్షలు, స్విఫ్ట్ వ్యవస్థ నుండి తొలగించడం వంటి చర్యలు మిగిలిన దేశాలను భయపెట్టాయి. 2000వ సంవత్సరంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా 60% పైగా ఉండేది. కానీ నేడు అది 40% కి పడిపోయింది. ఈ తగ్గుదల ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని స్పష్టం చేస్తోంది. మార్కెట్‌లోకి ఒకేసారి భారీగా డాలర్లు వచ్చి, బంగారం కోసం డిమాండ్ పెరిగితే.. ధరలు అదుపు లేకుండా పెరుగుతాయి. ఐదేళ్ల కాలపరిమితిలో ఇది 80% వృద్ధిని నమోదు చేస్తూ ఔన్సు గోల్డ్ 8,000 డాలర్లకు చేరవచ్చని ఈ బ్యాంక్ అంచనా వేసింది. ఇది నిజమైతే, ఒక తులం బంగారం ధర సామాన్యుడికి కలగానే మిగిలిపోవచ్చు. గతంలో కేవలం భారత్, చైనా వంటి సంప్రదాయ దేశాలే బంగారం కొనేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఇప్పుడు దూకుడుగా బంగారాన్ని కొంటున్నాయి. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నుండి రక్షణ పొందాలంటే బంగారం మాత్రమే ఏకైక మార్గమని ఈ దేశాలు నమ్ముతున్నాయి. ఎందుకంటే బంగారం ఏ ఒక్క దేశానికి సొంతం కాదు. దీన్ని డిజిటల్‌గా ఎవరూ ‘ఫ్రీజ్’ చేయలేరు. ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల నిల్వల్లో బంగారం వాటా 30% ఉండగా, దీన్ని 40% నుండి 50%కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సాధారణంగా యుద్ధం వస్తే బంగారం ధరలు పెరగాలి. కానీ ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి పరిస్థితుల్లో కూడా బంగారం ధరలు కొన్నిసార్లు స్వల్పంగా తగ్గుతున్నాయి. భూమి నుండి బంగారం తీయడం ఏటేటా కష్టతరమవుతోంది. కొత్త గనులు బయటపడడం లేదు. సరఫరా తక్కువగా ఉండి, కేంద్ర బ్యాంకుల డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గడానికి ఆస్కారం లేదంటున్నారు. కరెన్సీ నోట్లు ముద్రించవచ్చు, కానీ బంగారాన్ని సృష్టించలేం. అందుకే ప్రభుత్వాల అప్పులు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపు పరుగులు తీస్తారు. రాబోయే కాలంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో, ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో కనీసం 10-15% బంగారం ఉండటం శ్రేయస్కరంగా భావిస్తున్నారు. బంగారం కేవలం ఆభరణం కాదు, అది ఒక ‘గ్లోబల్ కరెన్సీ’. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చినా, పసిడి తన మెరుపును కోల్పోదు సగటున ఇది ఒక ద్రవ్యపరమైన రక్షణ కవచంగా నిలుస్తుందన్నది నిపుణుల మాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??
హిప్పోల మెడ మీద వేలాడిన కత్తి.. కొలంబియా నిర్ణయంపై అంబానీ స్పందన
జ్యూస్ సెంటర్లలో జ్యూస్ తాగుతున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్