గర్భిణీలు: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా ఉంటుందని కొందరు భావిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ, మీరు ఎంచుకునే చేప రకాన్ని బట్టి ఫలితం మారుతుంది. సముద్రంలోని షా సొరచేప, స్వార్డ్ ఫిష్, కింగ్ మాకెరల్ వంటి పెద్ద చేపలు చిన్న చేపలను తిని పెరుగుతాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో పాదరసం స్థాయిలు విపరీతంగా పేరుకుపోతాయి. గర్భిణీలు ఈ చేపలను తింటే, ఆ మెర్క్యురీ నేరుగా గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఇది భవిష్యత్తులో పిల్లల్లో వైకల్యానికి లేదా మందబుద్ధికి దారితీయవచ్చు.
10 ఏళ్లలోపు పిల్లలు: పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు అవసరమే కానీ చేపల విషయంలో నియంత్రణ ఉండాలి. 10-11 ఏళ్ల లోపు పిల్లల శరీరంలో మెర్క్యురీని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. మెర్క్యురీ ప్రభావం వల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, చదవడంలో ఇబ్బందులు, ప్రవర్తనా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు చెరువులు, వాగులు పెరిగే చేపలను మాత్రమే పిల్లలకు అందించడం సురక్షితం.
సీఫుడ్ అలర్జీ: చాలా మందికి చేపలు లేదా రొయ్యలు తిన్న తర్వాత ఒళ్లు నవ్వడం లేదా చిన్న చిన్న దద్దుర్లు రావడం జరుగుతుంది. దీన్ని చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇది అనాఫిలాక్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు. చేపలు తిన్న నిమిషాల్లోనే ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడం, నాలుక వాపు, రక్తపోటు పడిపోవడం వంటివి జరిగితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఇలాంటి వారు చేపలకు పూర్తిగా దూరంగా ఉండటమే ఏకైక మార్గం.
బ్లడ్ థిన్నర్స్ – ఒమెగా-3 కాంబినేషన్: గుండె జబ్బులు లేదా రక్తపోటు సమస్యల కోసం రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు చేపల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తాన్ని సహజంగానే పలుచగా చేస్తాయి. మందులు, చేపలు రెండూ కలిస్తే రక్తం మరీ పల్చబడి, దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టదు. దీనివల్ల అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
యూరిక్ యాసిడ్, కిడ్నీ సమస్యలు: చేపల్లో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు చేపలు ఎక్కువగా తింటే, ఆ సమస్య మరింత జటిలమవుతుంది. ఇది కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. కాగా ప్రస్తుతం చైనీస్, జపనీస్ వంటకాల ప్రభావంతో సుశి వంటి పచ్చి చేపల వంటకాలు పాపులర్ అవుతున్నాయి. కానీ సరిగ్గా వండని చేపల్లో లిస్టెరియా, సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు ఇవి తింటే తీవ్రమైన వాంతులు, విరేచనాలు, ఇన్ఫెక్షన్లకు గురవుతారు.




