Praful Hinge : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఇప్పుడు ఒకే పేరును జపిస్తున్నారు.. ఆ పేరే ప్రఫుల్ హింగే. ఐపీఎల్ అరంగేట్రంలోనే రాజస్థాన్ రాయల్స్ లాంటి పటిష్టమైన జట్టును వణికించి, తన ముద్ర వేసుకున్నాడు ఈ యువ పేసర్. ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో రాజస్థాన్‌ను 57 పరుగుల తేడాతో మట్టికరిపించడంలో ప్రఫుల్ కీలక పాత్ర పోషించాడు. కేవలం వికెట్లు తీయడమే కాదు, తాను అనుకున్నది మైదానంలో చేసి చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎగురవేసుకున్నాడు.
రాజస్థాన్‌ను దెబ్బకొట్టిన ప్రఫుల్ మ్యాజిక్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఈ లక్ష్యం పెద్ద కష్టమేమీ కాదనిపించింది. కానీ, బంతిని అందుకున్న ప్రఫుల్ హింగే కథను మార్చేశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అతను, తొలి బంతికే భీకర ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని పెవిలియన్ పంపాడు. అదే ఓవర్ నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను కూడా డకౌట్ చేయడంతో రాజస్థాన్ కోలుకోలేని దెబ్బతిన్నది. ఆ తర్వాత లూయాన్-డ్రే ప్రిటోరియస్, రియాన్ పరాగ్ వికెట్లను కూడా పడగొట్టి మొత్తం 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించాడు.
డైరీలో రాసుకున్న కల
మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ప్రఫుల్ మనసులోని మాటను పంచుకున్నాడు. “నేను నా డైరీలో ఎక్కడో రాసుకున్నాను.. నా అరంగేట్రం మ్యాచ్‌లోనే 4 నుంచి 5 వికెట్లు తీయాలని. మనం గట్టిగా నమ్మితే ఏదైనా నిజమవుతుందని నేను నమ్ముతాను. పవర్ ప్లేలో బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావాలనేది నా ప్లాన్. అనుకున్నట్లుగానే వైభవ్ సూర్యవంశీని బౌన్సర్‌తో అవుట్ చేస్తానని నా స్నేహితులతో ముందే చెప్పాను. మా బౌలింగ్ కోచ్ సహాయంతో వేసిన ఆ ప్లాన్ పక్కాగా పని చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు.
సామాన్య నేపథ్యం నుంచి ఐపీఎల్ స్టార్ వరకు
ప్రఫుల్ క్రికెట్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు అతనికి లెదర్ బాల్ అంటే ఏంటో కూడా తెలియదట. తన తండ్రిని క్రికెట్ క్లబ్‌లో చేర్పించమని అడిగితే, మొదట వయసు చిన్నదని వారించినా, ఆ తర్వాత ప్రోత్సహించారు. “నా చిన్నతనంలో తండ్రి నన్ను క్లబ్‌కు తీసుకెళ్లడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ అవార్డును నా కుటుంబానికి అంకితం ఇస్తున్నాను” అని ప్రఫుల్ భావోద్వేగానికి లోనయ్యాడు. రాజస్థాన్‌పై సాధించిన ఈ విజయం సన్‌రైజర్స్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..