Headlines

Pillow Talk: పిల్లో టాక్ అంటే తెలుసా..? దాంపత్య జీవితంలో మ్యాజిక్ చేస్తుంది..!


భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఖరీదైన బహుమతులు, తరచూ బయటకు వెళ్లడం మాత్రమే అవసరం లేదు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు పడకగదిలో దంపతులు ఏకాంతంలో ప్రేమగా.. ప్రశాంతంగా కలిసి మాట్లాడుకునే సమయాన్ని నిపుణులు ‘పిల్లో టాక్‌’గా పేర్కొంటారు. ఆ రోజులో జరిగిన ఆసక్తికర విషయాలు, ఎదురైన ఇబ్బందులు, తమ భావాలు, భవిష్యత్తు గురించి ఇలా ఎన్నో విషయాలను ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. దీనివల్ల దాంపత్య బంధం ఎంతో బలపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

రోజంతా ఆఫీస్, ఇంటి పనులు, బాధ్యతలు, ఒత్తిడితో బిజీగా ఉండే దంపతులకు ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం దొరకడం కాస్త కష్టమే. అయితే అలాంటి సమయంలో నిద్రకు ముందు కాసేపు మాట్లాడుకోవడం వల్ల మనసులోని విషయాలను భాగస్వామితో పంచుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ఒకరి ఆలోచనలు మరొకరికి బాగా అర్థమవుతాయి.

ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెరుగుతుంది

దాంపత్య జీవితంలో భావోద్వేగ సాన్నిహిత్యం(ఎమోషనల్ అటాచ్‌మెంట్) చాలా కీలకం. భాగస్వామి చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం, వారి భావాలను గౌరవించడం వల్ల పరస్పర నమ్మకం పెరుగుతుంది. చిన్న విషయాలైనా సరే పట్టించుకుని మాట్లాడుకోవడం ‘నేను నీతోనే ఉన్నాను’ అనే భరోసాను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి



అపార్థాలు తగ్గుతాయి

కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోకపోవడం వల్లే చిన్న సమస్యలు పెద్దవిగా మారుతాయి. రోజులో జరిగిన ఏదైనా విషయం బాధ కలిగించినా దాన్ని మనసులోనే దాచుకోవడం కంటే, సరైన సమయంలో ప్రశాంతంగా చెప్పుకోవడం మంచిది. అయితే ఈ సమయంలో వాదనలు పెట్టుకోవడం కాకుండా సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది

మనసులో ఉన్న విషయాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. భాగస్వామితో ఆప్యాయంగా మాట్లాడటం, రోజంతా జరిగిన మంచి విషయాలను గుర్తుచేసుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించడం వల్ల నిద్రకు ముందు మనసు ప్రశాంతంగా మారే అవకాశం ఉంటుంది.

బంధంలో ఆప్యాయత పెరుగుతుంది

‘ఈ రోజు ఎలా గడిచింది?’, ‘ఏమైనా ఇబ్బంది ఎదురైందా?’, ‘రేపు ఏం చేయాలి?’ వంటి చిన్న ప్రశ్నలే అయినా భాగస్వామిపై శ్రద్ధను తెలియజేస్తాయి. పరస్పరం కృతజ్ఞత చెప్పుకోవడం, అభినందించడం, ప్రేమను వ్యక్తంచేయడం దాంపత్య బంధంలో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

అయితే పిల్లో టాక్‌ అంటే తప్పనిసరిగా గంటల తరబడి మాట్లాడాలని కాదు. రోజుకు కొద్దిసేపైనా మొబైల్‌ ఫోన్లు పక్కన పెట్టి, టీవీ ఆపి, ఒకరినొకరు చూసుకుంటూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం ముఖ్యం. ముఖ్యంగా నిద్రకు ముందు వాదనలు, విమర్శలు, పాత సమస్యలను పదేపదే ప్రస్తావించడం కాకుండా పరస్పర అవగాహన పెంచే సంభాషణలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. చిన్న చిన్న సంభాషణలే దంపతుల మధ్య పెద్ద అనుబంధానికి బాటలు వేస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *