శ్రీకాకుళం జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతం, వలసల జిల్లా అనే పేరు కూడా ఉంది. జిల్లాకు 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉండటంతో పాటు నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బహుదా వంటి నదులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జిల్లా వాసులు అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నెల్లూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మరికొందరు కుటుంబాలను స్వగ్రామాల్లోనే ఉంచి ఉపాధి కోసం దుబాయ్, అబుదాబి, సైప్రస్, యూఏఈ వంటి విదేశాలకు వెళ్తున్నారు.
సాధారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సంక్రాంతి పండుగ సమయంలో స్వగ్రామాలకు వస్తుంటారు. విదేశాల్లో ఉన్నవారికి మాత్రం స్వగ్రామాలకు రావడం అంత సులభం కాదు. అయితే ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో విద్య, ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారంతా ఓటు వేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా వస్తుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలు ఈ నెల 26న ఏడు మండలాల్లో జరిగాయి. రెండో విడతలో ఈ నెల 29న 13 మండలాల్లో, మూడో విడతలో డిసెంబర్ 2న పది మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గత వారం రోజులుగా జిల్లాకు చెందిన వలసజీవులు ఎక్కడెక్కడి నుంచో స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. శ్రీకాకుళం వైపు వచ్చే రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
తొలి విడత ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ఒకే గ్రామానికి చెందిన వారంతా కలిసి ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేసుకుని స్వగ్రామాలకు చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా ఓటు వేయడానికి సొంతూళ్లకు చేరుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా కనిపిస్తోంది.
విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు!
సోంపేట మండలం తాళ్లభద్ర గ్రామంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు న్యూజిలాండ్, సైప్రస్, యూఏఈ వంటి దేశాల నుంచి సైతం గ్రామస్థులు వచ్చారు. ఈ గ్రామానికి చెందిన తొమ్మిది మంది విదేశాల నుంచి ప్రత్యేకంగా స్వగ్రామానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఈశ్వరరావు అనే వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలు ఖర్చు చేసి మరీ న్యూజిలాండ్ నుంచి ఓటు వేయడానికి వచ్చినట్లు చెబుతున్నారు.
మరోవైపు స్వగ్రామాలకు తిరిగి వస్తున్న వలసజీవుల్లో కొందరు తమ సొంత ఖర్చులతో ప్రయాణిస్తుండగా.. మరికొందరికి గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులే ఫోన్ చేసి రవాణా ఖర్చులు భరిస్తూ స్వగ్రామాలకు రప్పిస్తున్నారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని వలసజీవుల రాకతో శ్రీకాకుళం పల్లెల్లో సందడి నెలకొంది.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.