Headlines

NEET UG 2026 Cancelled: నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. రంగంలోకి CBI దర్యాప్తు సంస్థ! కొత్త పరీక్ష తేదీ త్వరలో ప్రకటన

NEET UG 2026 Cancelled: నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. రంగంలోకి CBI దర్యాప్తు సంస్థ!  కొత్త పరీక్ష తేదీ త్వరలో ప్రకటన


న్యూఢిల్లీ, మే 12: నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. పలు రాష్ట్రాల్లో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.  మే 3వ తేదీన జరిగిన నీట్‌ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీయే మంగళవారం (మే 12) అధికారికంగా ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) తన ప్రకటనలో పేర్కొంది. ఎన్టీయే వద్ద ఉన్న సమాచారం, కేంద్ర ఏజెన్సీల ఇన్‌పుట్‌ ఆధారంగా నీట్ పేపర్‌ లీక్‌ అయినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మళ్లీ ఈ పరీక్షను నిర్వహించేందుకు త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఎన్టీయే తన ఎక్స్‌ ఖాతాలో ప్రకటించింది.

రాజస్థాన్‌లో వెలుగుచూసిన ‘గెస్ పేపర్ మెటీరియల్‌లో నీట్ అసలు ప్రశ్నాపత్రంలోని 410 ప్రశ్నలలో ఏకంగా 120 జువాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు అచ్చుగుద్దినట్లు సమాధానాల వరుస క్రమంతో సహా ఉండటం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఇప్పటికే రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజస్థాన్‌తోపాటు ఉత్తరాఖండ్‌, సికార్, డెహ్రాడూన్‌, మహారాష్ట్రసహా పలు ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు ప్రారంభించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న ఒక కోచింగ్ అకాడమీ నుంచి వీడియోలు, టెస్ట్-సిరీస్ పేపర్లుగా భావిస్తున్న కాపీలతో సహా పలు ఆధారాలు బయటపడ్డాయి.

దీంతో లీకేజీ ధృవీకరణ కోసం మే 8వ తేదీన ఎన్టీయే ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది. వీరి దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు తేలడంతో నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్ష కొత్త తేదీలతోపాటు అడ్మిట్ కార్డుల జారీ షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తదుపరి దర్యాప్తు కోసం కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తునకు తాము పూర్తి సహకరిస్తామని అవసరమైన అన్ని రికార్డులు, సహాయాన్ని అందిస్తామని ఎన్టీయే తెలిపింది. కాగాఈ  ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది హాజరయ్యారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *