Nail Biting: పదే పదే గోళ్లు కొరుకుతున్నారా? అయితే మీకు ఆ డేంజర్ తప్పదు

Nail Biting: పదే పదే గోళ్లు కొరుకుతున్నారా? అయితే మీకు ఆ డేంజర్ తప్పదు


Nail Biting: పదే పదే గోళ్లు కొరుకుతున్నారా? అయితే మీకు ఆ డేంజర్ తప్పదు

చాలామందికి చిన్నప్పటి నుండి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఒత్తిడికి లోనైనప్పుడు లేదా ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు తెలియకుండానే వేళ్లను నోట్లో పెట్టుకుని గోళ్లను కొరుకుతుంటారు. దీనిని కేవలం ఒక చిన్న అలవాటుగా మాత్రమే మనం చూస్తాం. కానీ, ఈ చిన్న అలవాటు మీ ప్రాణాల మీదకు తెస్తుందని, ఏకంగా మీ వేలునే తొలగించాల్సిన పరిస్థితిని కలిగిస్తుందని ఎప్పుడైనా ఊహించారా? ఇటీవల అమెరికాకు చెందిన 21 ఏళ్ల గాబీ స్వార్జెవ్‌స్కీ అనే యువతికి ఎదురైన భయంకరమైన అనుభవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తోంది. గోళ్లు కొరికే అలవాటు కారణంగా ఆమె తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురై తన వేలిని కోల్పోయే స్థితికి చేరుకుంది. వైద్య పరిభాషలో ‘ఒనికోఫాజియా’ అని పిలిచే ఈ అలవాటు ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుంది..
మన నోటిలో సహజంగానే వందలాది రకాల బ్యాక్టీరియాలు సూక్ష్మక్రిములు ఉంటాయి. మనం గోళ్లు కొరికినప్పుడు, గోరు చుట్టూ ఉండే సున్నితమైన చర్మంపై చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి. ఈ గాయాలు మన కంటికి కనిపించనంత చిన్నవిగా ఉన్నప్పటికీ, నోటిలోని బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడానికి ఇవి ప్రధాన ద్వారాలుగా మారుతాయి. ఇలా ప్రవేశించిన బ్యాక్టీరియా ‘పరోనిషియా’ (Paronychia) అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. గాబీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఆమె తన గోళ్లను కొరికినప్పుడు ఏర్పడిన చిన్న గాయం ద్వారా బ్యాక్టీరియా లోపలికి చేరి, క్రమంగా వేలు వాపు ఎక్కడం ప్రారంభమైంది. మొదట సాధారణ నొప్పిగా అనిపించినా, కొద్దిరోజులకే అది విపరీతమైన బాధగా మారి చీము పట్టేలా చేసింది. వైద్యులు నెలల తరబడి కఠినమైన చికిత్స అందించిన తర్వాతే ఆమె తన వేలిని కాపాడుకోగలిగింది.

తీవ్రమైన లక్షణాలు..
గోరు చుట్టూ ఉన్న చర్మం ఎరుపు రంగులోకి మారడం, వాపు రావడం తాకితే విపరీతమైన నొప్పి కలగడం ఈ ఇన్ఫెక్షన్ ప్రాథమిక లక్షణాలు. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ కేవలం చర్మానికే పరిమితం కాకుండా వేలి లోపలి ఎముకలకు (Osteomyelitis) కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరితే అది ‘సెప్సిస్’ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు. గాబీ తన అనుభవాన్ని పంచుకుంటూ, “నేను పడిన బాధ వర్ణనాతీతం, నా వేలు కుళ్ళిపోవడం చూసి చాలా భయపడ్డాను. ఎవరూ కూడా గోళ్లు కొరికే అలవాటును తేలికగా తీసుకోవద్దు” అని హెచ్చరించింది. తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్స చేసి చీమును బయటకు తీయాల్సి వస్తుంది, పరిస్థితి విషమిస్తే వేలిని తొలగించడం (Amputation) తప్ప మరో మార్గం ఉండదు.

గోళ్లు కొరికే అలవాటును వదిలించుకోవడానికి మార్గాలు
ఈ ప్రమాదకరమైన అలవాటును వదిలించుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇందుకోసం మీ గోళ్లను ఎల్లప్పుడూ పొట్టిగా శుభ్రంగా కత్తిరించుకోవాలి. గోళ్లు పొట్టిగా ఉంటే కొరకడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో లభించే చేదుగా ఉండే నెయిల్ పాలిష్‌లను వాడటం వల్ల, వేలు నోట్లో పెట్టుకోగానే ఆ చేదుకు అలవాటు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు గోళ్లు కొరుకుతున్నారో గమనించి, ఆ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇతర పనుల్లో నిమగ్నమవ్వాలి. ఒకవేళ గోరుకు ఏదైనా చిన్న గాయమైతే వెంటనే దానిని శుభ్రం చేసి యాంటీసెప్టిక్ క్రీమ్ రాయడం మర్చిపోవద్దు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గుర్తించి, ఇప్పుడైనా ఈ ‘ఒనికోఫాజియా’ అలవాటుకు స్వస్తి పలకండి.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం. ఏదైనా ఇంటి చిట్కాలు పాటించే ముందు వైద్య సలహా తప్పనిసరి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *