MI vs CSK : ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. కేవలం ఆటలోనే కాకుండా రూల్స్ విషయంలోనూ ఈ మ్యాచ్ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఆటగాడు మిచెల్ శాంట్నర్ గాయపడటం, ఆయన స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా శార్దూల్ ఠాకూర్ మైదానంలోకి రావడంపై తీవ్ర చర్చ నడిచింది. దీనిపై ముంబై కోచ్ మహేల జయవర్ధనే ఎట్టకేలకు నోరు విప్పారు.
అసలేం జరిగిందంటే?
చెన్నై ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కార్తీక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడానికి మిచెల్ శాంట్నర్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద డైవ్ చేశారు. క్యాచ్ అయితే పట్టారు కానీ, ఆ క్రమంలో ఆయన ఎడమ భుజం బలంగా నేలకు తగిలింది. వెంటనే ఆయన భుజం పట్టుకుని నొప్పితో విలవిలలాడుతూ మైదానం వెలుపలికి వెళ్ళిపోయారు. డగౌట్‌లో ఆయన భుజానికి ఐస్ ప్యాక్ కట్టుకుని కనిపించారు. ఓనర్ ఆకాశ్ అంబానీ కూడా శాంట్నర్ గాయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించారు.
భుజం గాయం.. కన్కషన్ సబ్ ఎలా?
మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మహేల జయవర్ధనే దీనిపై వివరణ ఇచ్చారు. “శాంట్నర్‌కు భుజంతో పాటు మెడ, తల భాగంలో కూడా దెబ్బ తగిలింది. ఆయనను స్కాన్ కోసం పంపించాం. తిరిగి వచ్చిన తర్వాత ఆయన నిలకడగా లేనట్లు అనిపించింది. అందుకే మేము మ్యాచ్ రెఫరీ, అంపైర్లకు కన్కషన్ సబ్‌స్టిట్యూట్ కోసం రిక్వెస్ట్ పెట్టాం. వారు అనుమతించడంతో శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దించాం” అని మహేల తెలిపారు. శాంట్నర్ పరిస్థితిపై ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పనిచేయని శార్దూల్ అస్త్రం
శాంట్నర్ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శార్దూల్ ఠాకూర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన శార్దూల్, 12 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ముంబై ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. అకీల్ హొస్సేన్ ధాటికి ముంబై వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలిపోయింది.
ముంబై ఘోర పరాజయం
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అజేయ సెంచరీతో(101*) చెన్నై 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. అకీల్ హొస్సేన్ 4 వికెట్లతో చెలరేగడంతో ముంబై 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 103 పరుగుల తేడాతో ముంబై ఎదుర్కొన్న ఈ ఓటమి ఆ జట్టు చరిత్రలోనే అతిపెద్ద పరాజయంగా నమోదైంది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరగా, ముంబై ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..