Headlines

Kuldeep Yadav : 104 మ్యాచులు ఆడితే 38 మ్యాచుల్లోనే ప్లేస్.. పాపం కుల్దీప్‌ను చూస్తే జాలేస్తోంది

Kuldeep Yadav : 104 మ్యాచులు ఆడితే 38 మ్యాచుల్లోనే ప్లేస్.. పాపం కుల్దీప్‌ను చూస్తే జాలేస్తోంది


Kuldeep Yadav : ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను వరుసగా పక్కన పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు అందుబాటులో లేకపోయినప్పటికీ, లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కూడా కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. మ్యాచ్ విన్నర్ అయిన స్పిన్నర్‌ను ఇలా బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ భారత క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టులో కుల్దీప్ యాదవ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాల ప్రకారం.. గంభీర్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్ వేర్వేరు ఫార్మాట్లలో మొత్తం 104 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, అందులో కుల్దీప్ కేవలం 38 మ్యాచ్‌ల్లో మాత్రమే తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్‌కు ఇన్ని తక్కువ అవకాశాలు రావడం ఆయన ఫ్యూచర్ ప్లానింగ్‌పై పలు అనుమానాలకు దారితీస్తోంది.

ఘాటుగా స్పందించిన రవిచంద్రన్ అశ్విన్

కుల్దీప్‌కు జరుగుతున్న అన్యాయంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీమ్ మేనేజ్‌మెంట్ వైఖరిని తప్పుబడుతూ.. “కుల్దీప్ ఇక ఎంతమాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికల్లో లేడని స్పష్టమవుతోంది. రాని అవకాశాల కోసం ఎదురుచూడటం ఆపేయాలి” అని వ్యాఖ్యానించారు. బ్యాటర్ల ఆధిపత్యం నడిచే ఈ క్రికెట్ ప్రపంచంలో ఒక బౌలర్ ఆత్మవిశ్వాసం, ఫామ్ ఎంత ముఖ్యమో మేనేజ్‌మెంట్ అర్థం చేసుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సూటిగా సూచనలు చేసిన మాజీ స్పిన్నర్

అశ్విన్ మాట్లాడుతూ.. “కుల్దీప్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. అతను మరో 35, 36 ఏళ్ల వయసు వరకు సులభంగా ఆడగలడు. మంచి కాంట్రాక్ట్ ఉంది, ఇటీవలే ఐపీఎల్ ట్రేడింగ్‌లోనూ భాగమయ్యాడు. అలాంటప్పుడు ఇలా అవకాశాలు రాని చోట సమయం వృధా చేసుకోవడం కంటే తన సామాన్లు సర్దుకుని వచ్చేయడమే మంచిది. మహమ్మద్ కైఫ్ అన్నట్లుగా, ఇలాంటి పరిస్థితి వల్ల ఉపయోగం ఏమిటి?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ప్రపంచంలోనే బెస్ట్ రిస్ట్ స్పిన్నర్

అంతేకాకుండా కుల్దీప్ యాదవ్ టాలెంట్ పై అశ్విన్ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుల్దీప్ ప్రపంచంలోనే అత్యుత్తమ రిస్ట్ స్పిన్నర్ అని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచ దిగ్గజ స్పిన్నర్లకు ఏమాత్రం తీసిపోని రికార్డు ఆయన సొంతమని గుర్తుచేశారు. నేను ఎప్పుడూ భారత క్రికెట్ శ్రేయస్సు గురించే ఆలోచిస్తానని, ఐపీఎల్ సమయంలో కూడా ఇక్కడి ప్రదర్శనలు టీమిండియాకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచిస్తుంటానని అశ్విన్ పేర్కొన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *