పెళ్లి, పిల్లలు, సంసారం అన్నాక చిన్నచిన్న గొడవలు రావడం సహజమే. కానీ, కొన్నిసార్లు ఈ గొడవలే హద్దులు దాటి జీవితాలను నాశనం చేసుకునే వరకు వెళ్తాయి. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో కూడా అలాంటి ఘటనే వెలుగుచూసింది. చీర కొనివ్వలేదన్న కారణంతో భార్య భర్తల మధ్య చిన్నగా మొదలైన గొడవ.. చివరకు ఒకరి ప్రాణాన్నే బలిగొంది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసులో నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరేరామ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవితో కలిసి శిర్గావ్‌లో నివసిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం తనకి చీర కొనివ్వాలని సునీతా దేవి భర్తను కోరగా, అందుకు అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీతా దేవి కిచెన్‌లో ఉన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని భర్త తలపై బలంగా కొట్టింది. దీంతో అతను కిందపడిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే హరేరామ్ సింగ్ అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో ఆమెపై తిరిగి దాడి చేయలేకపోయాడు. అయితే తొలుత పోలీసులకు తప్పుదోవ పట్టించేందుకు ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత తప్పుంచుకోవాలని చూసింది. కానీ ఈ గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ల 7 ఏళ్ల కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడని.. పోలీసులు ఆ చిన్నారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు చెప్పిన సాక్షంతో సునీతా దేవిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు.
అయితే భార్య భర్తల మధ్య గొడవలు కొత్తేం కాదని గతంలో కూడా తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాబట్టి ఈ హత్య కేవలం చీర కోసమే జరిగిందా? లేక దీని వెనుక కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే హత్య సమయంలో ఇంట్లో వేరే ఎవరైనా ఉన్నారా, ఆనవాళ్లు తుడిచేయడానికి ప్రయత్నించారా అనే విషయాలపై కూడా బద్లాపూర్ ఈస్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.