Headlines

Kherepati Temple: సజీవ నాగులతో విష్ణుమూర్తికి అలంకారం.. ఈ అరుదైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

Kherepati Temple: సజీవ నాగులతో విష్ణుమూర్తికి అలంకారం.. ఈ అరుదైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?


Kherepati Temple Kanpur: హిందూ సంప్రదాయంలో ‘నాగపంచమి’ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. సర్పదేవతలను ఆరాధిస్తూ జరుపుకునే ఈ పర్వదినాన్ని ఈ ఏడాది ఆగస్టు 17న దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో జరిగే నాగపంచమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడి ఖేరేపతి ఆలయంలో నాగపంచమి సందర్భంగా నిర్వహించే విశేష పూజలు, సజీవ పాములతో చేసే అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

సజీవ నాగులతో విష్ణుమూర్తికి అలంకరణ

కాన్పూర్‌లోని రద్దీ ప్రాంతమైన మాల్ రోడ్‌లో ఉన్న ఖేరేపతి ఆలయం సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం. శ్రావణ మాసమంతా ఈ ఆలయంలో భక్తుల రద్దీ కనిపించినా, నాగపంచమి రోజున ప్రత్యేకంగా వేలాది మంది దర్శనానికి తరలివస్తారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే.. విష్ణుమూర్తి విగ్రహానికి ఒక జత సజీవ నాగులను అలంకరించడం. అనంతరం ఆ పాములను స్వామివారి విగ్రహంతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాజు గదిలో ఉంచుతారు. అద్దాల మధ్యలో కొలువై ఉన్న విష్ణుమూర్తి చుట్టూ నాగులు సంచరిస్తూ కనిపించే దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

భక్తులను ఆకట్టుకునే ప్రత్యేక జాతర

నాగపంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ జాతర నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సర్పాలను తీసుకువచ్చి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ సందర్భంగా తీసుకువచ్చే కొన్ని నాగుల జంటలను దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తుంటారు.

ఇవి కూడా చదవండి



ఖేరేపతి ఆలయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ

ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఓ పురాణ గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. కథనం ప్రకారం, కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి తల్లికి ఒక రోజు కలలో ఆదిశేషుడు దర్శనమిచ్చి, తాను ఉన్న ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. ఆ సూచన మేరకు ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా, అక్కడ పురాతన బావితో పాటు అనేక సర్పాలు బయటపడినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో శేషనాగు నివసిస్తాడనే విశ్వాసం ఏర్పడింది. ఆ నమ్మకానికే గుర్తుగా ప్రతి ఏడాది నాగపంచమి సందర్భంగా సజీవ నాగులతో ప్రత్యేక అలంకరణ చేసే సంప్రదాయం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

(Disclaimer: ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాథలు, స్థానిక విశ్వాసాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగా చెప్పబడుతున్నాయి. వీటికి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉండవచ్చు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *