Headlines

Jetlee Movie Review: జెట్లీ సినిమా రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ పంచిన నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?

Jetlee Movie Review: జెట్లీ సినిమా రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ పంచిన నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?


మూవీ రివ్యూ: జెట్లీ

హీరో: సత్య, వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్, శుభలేఖ సుధాకర్ తదితరులు

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫర్: సురేష్ సారంగం

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

దర్శకుడు: రితేష్ రానా

నిర్మాతలు: చెర్రీ, హేమలత పెదమల్లి

కథ :

బ్యాంక్ అధినేత అయిన ప్రజాపతి (అజయ్) సుమారు 15 వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడి తన సంస్థను కావాలనే దివాళా తీయిస్తాడు. ఈ భారీ మోసగాడిని పట్టుకునే బాధ్యతను స్పెషల్ ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) తీసుకుంటుంది. దుబాయ్లో తలదాచుకున్న అతడిని ప్రాణాలతో పట్టుకుని ఒక ప్రత్యేక విమానంలో కొచ్చికి తరలించే పనిలో ఆమె ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో తన గతాన్ని పూర్తిగా మర్చిపోయిన డాక్టర్ వేద్ వ్యాస్ (సత్య) కూడా అనుకోకుండా అదే విమానంలో ప్రయాణిస్తూ ఉంటాడు. అసలు డాక్టర్ వేద్ వ్యాస్‌కు ఈ ప్రయాణంతో ఉన్న సంబంధం ఏమిటి? ఆ బ్యాంక్ కుంభకోణానికి, అతడికి ఏమైనా లింక్ ఉందా? ఈ కీలకమైన ఆపరేషన్ లో వేద్ వ్యాస్ ఎలాంటి పాత్ర పోషించాడు? అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, చివరకు ఈ వ్యవహారం మొత్తం ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయాల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

కథనం :

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు దర్శకుడు రితేష్ రానా కేవలం వినోదాన్నే నమ్ముకున్నాడు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి చిన్న నేపథ్యపు వివరాలను, వస్తువులను కూడా కామెడీ చేయడానికి వాడుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఒక మోస్తరుగా అలరిస్తాయి. కానీ కేవలం కొన్ని నవ్వించే సన్నివేశాలపైనే ఆధారపడి సినిమా మొత్తాన్ని నడపడం వల్ల.. ఒక బలమైన కథలో ఉండాల్సిన ఇంటెన్సిటీ లోపించింది. వినోదాన్ని పక్కన పెడితే.. మిగతా కథా గమనం అంతా ఎక్కడా కొత్తదనం లేకుండా చాలా రొటీన్‌గా, ఊహకు తగ్గట్లుగానే సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ తరువాత ద్వితీయార్థంలో సినిమా కాస్త నెమ్మదిస్తుంది. ఎంచుకున్న పాయింట్‌కు తగినట్లుగా బలమైన సంఘటనలు లేకపోవడంతో మధ్యలో వచ్చే చాలా సీన్స్ కాస్త స్లో అవుతాయి. విమానం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ తరహా కథ కాబట్టి అందులో ఎత్తుగడలు చాలా ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఆ దిశగా స్క్రీన్ ప్లే అడుగులు వేయలేదు. ఒకపక్క స్పెషల్ ఏజెంట్ తో సీరియస్ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ.. ఆ సీరియస్ నెస్ కథలో కనిపించదు. హీరో సత్య కాబట్టి ప్రతీది కామెడీ చేయాలనుకున్నాడు రితేష్ రానా. కథ క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ దర్శకుడు లాజిక్స్ పూర్తిగా గాలికొదిలేశాడు. దీనివల్ల క్లైమాక్స్ సీన్స్ పేలవంగా ముగుస్తాయి. డాక్టర్ వేద్ వ్యాస్ పాత్రను కూడా ఇంకాస్త వివరంగా, పూర్తి స్థాయిలో ముగించి ఉంటే బాగుండేది కానీ అక్కడ అసంపూర్తిగా అనిపిస్తుంది. కామెడీ మీద పెట్టిన శ్రద్ధ అసలు కథను నడిపించడంలో, ఉత్కంఠను రేకెత్తించడంలో పెట్టి ఉంటే అవుట్ పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేది. కేవలం వన్ లైనర్లు, అక్కడక్కడా పేలే జోకులు మాత్రమే ఒక పూర్తి స్థాయి సినిమా కథనాన్ని ముందుకు లాగలేవు అని ఈ చిత్రం నిరూపిస్తుంది. ఒక పటిష్టమైన కథా బలం లేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా సాగడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్రతికూలతలుగా మారాయి.

నటీనటులు :

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కమెడియన్ సత్య అని నిస్సందేహంగా చెప్పొచ్చు. తనదైన టైమింగ్‌తో, వైవిధ్యమైన హావభావాలతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. పెద్ద పెద్ద డైలాగులను సైతం చాలా సునాయాసంగా, ఎక్కడా తడబాటు లేకుండా చెబుతూ తనదైన మార్క్ చూపించాడు. వెన్నెల కిషోర్‌తో కలిసి సత్య పండించిన హాస్యం థియేటర్లలో మంచి నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిషోర్ కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో అజయ్ పర్లేదు. సహచర పైలెట్లతో కలిసి వైవా హర్ష చేసిన కొన్ని దృశ్యాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యి నవ్వులు తెప్పిస్తాయి. స్పెషల్ ఏజెంట్‌గా రియా సింఘా తన యాక్షన్‌తో పాటు గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది.

టెక్నికల్ టీం:

కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా కుదిరింది.. విజువల్స్ చాలా రిచ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం మాత్రం ఇంకాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. ముఖ్యంగా రెండో భాగంలో సాగదీసినట్లు అనిపించే బోరింగ్ సీన్లను తొలగించి ఉంటే బాగుండేది. దర్శకుడు రితేష్ రానా నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నప్పటికీ, రచయితగా కథ, కథనాలను రాసుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.. ఎక్కడా రాజీ పడినట్లు కనిపించదు. ముఖ్యంగా విమానం లోపల జరిగే కథ కావడంతో, ఆ వాతావరణాన్ని చాలా సహజంగా సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్ బృందాన్ని కచ్చితంగా ప్రశంసించాలి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా జెట్లీ.. కాస్త కామెడీ.. కాస్త కదుపులు..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *