Headlines

IPL 2027: ఆరు జట్లకు కెప్టెన్లు ఖరారు.. ముంబై ప్రకటనపైనే అందరి చూపు


IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ జట్లలో కెప్టెన్సీ చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే సీజన్ కోసం ఇప్పటికే పది జట్లు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆరు జట్లలో పాత కెప్టెన్లే కొనసాగుతారని అంచనాలు ఉన్నాయి. మరో మూడు జట్లలో మాత్రం కొత్త సారథుల ఎంపికపై స్పష్టత రావాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ కూడా నవంబర్ 27న సాయంత్రం 5:45 గంటలకు తమ కెప్టెన్ పేరును ప్రకటించనుంది. రోహిత్ శర్మ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పష్టత ఉండదు.

ఆర్సీబీ నుంచి సన్‌రైజర్స్ జట్లకు వీరే కెప్టెన్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్సీ వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్‌లో జట్టును నడిపించిన అతడిపై యాజమాన్యం నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ కొనసాగనున్నారు. ఎంఎస్ ధోనీ ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు పూర్తిగా గైక్వాడ్ చేతుల్లోనే ఉండనున్నాయి. గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ట్రేడ్ ద్వారా వచ్చినప్పటికీ.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా కొనసాగుతారని కథనం పేర్కొంది. రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్‌పై నమ్మకం ఉంచినట్లు సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే అతడు అందుబాటులో లేని సమయంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించే బాధ్యత తీసుకోవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో అసలు పోటీ

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో అక్షర్ పటేల్ జట్టును నడిపించాడు. అయితే ట్రేడ్ ద్వారా మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ జట్టులోకి రావడంతో కొత్త చర్చ మొదలైంది. ఇద్దరిలో ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇంకా తేలలేదు. కోచింగ్ బృందంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినట్లు కథనం పేర్కొంది. దీంతో ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేకేఆర్, లక్నోలో కొత్త కెప్టెన్ల కోసం వెతుకులాట

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గత సీజన్‌లో అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ జట్టులో రింకూ సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతడికి అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో ఆ జట్టుకు నాయకత్వం వహించిన రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరడంతో లక్నోకు ఈ పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు? లేక వేలంలో కొత్త ఆటగాడిని తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ముంబై ప్రకటనపై ఉత్కంఠ

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా పంజాబ్ కింగ్స్‌కు పంపిన ముంబై.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. రోహిత్ శర్మ మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపడతాడనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముంబై అతడి కెప్టెన్సీలో 2013, 2015, 2017, 2019, 2020లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది. జెర్సీ నంబర్ 45, ఐదు టైటిళ్లను గుర్తు చేసేలా 5:45 గంటలకు ప్రకటన సమయం నిర్ణయించడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అయితే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా చర్చలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 27 సాయంత్రం 5:45 గంటలకు వచ్చే అధికారిక ప్రకటనతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఇక ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *