Headlines

ఓరి నాయనో ఇంకెన్ని చూడాలో.. బ్రతికుండగానే సొంత అంత్యక్రియలకు బుకింగ్ !


ఒక మనిషి బతికుండగానే తన సొంత అంత్యక్రియల కోసం ముందే ప్యాకేజీ బుక్ చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ సంస్థ సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. సాధారణంగా మనం సినిమా టికెట్లకో, ఫ్లైట్ జర్నీకో, హోటల్ రూమ్స్‌కో లేదా వెకేషన్ ట్రిప్పులకో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాం. కానీ చావు అనే మాట వింటేనే భయపడిపోయే సమాజంలో.. ఆ మరణాన్నే ఒక బిజినెస్ మోడల్‌గా మార్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)లో ‘మోక్ష వాయేజ్’ (Moksh Voyage) అనే సంస్థ ఈ కొత్త తరహా సేవలను పరిచయం చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది.

అసలు ఏంటీ ‘మోక్ష వాయేజ్’?

‘నమో గంగే వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఈ మోక్ష వాయేజ్ స్టార్టప్ నడుస్తోంది. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోతారు. అలాంటి క్లిష్ట సమయంలో అంత్యక్రియలకు సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకోవడం వారికి ఎంతో కష్టమవుతుంది. కుటుంబ సభ్యులపై ఆ భారాన్ని తగ్గించి.. ఒకే చోట అన్ని ఏర్పాట్లు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఈ స్టార్టప్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశంలోని మరికొన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఈ సంస్థ అందించే సేవలు ఇవే..

  • హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏ-టు-జెడ్ ఏర్పాట్లను వీరు చూసుకుంటారు.
  • మృతదేహాన్ని మోయడానికి నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేయడం నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహనం సమకూర్చడం వరకు వీరే చూసుకుంటారు.
  • దహన సంస్కారాలకు అవసరమైన కట్టెలు, పూలు, ఇతర పూజా సామగ్రిని అందించడంతో పాటు పూజారిని పిలిపించి క్రతువు మొత్తం పూర్తి చేయిస్తారు.
  • కేవలం దహన సంస్కారాల వరకు మాత్రమే కాకుండా ఆ తర్వాత చితాభస్మం సేకరించడం, అస్థికలను నదిలో నిమజ్జనం చేయడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అవసరమైన ఘాట్, పడవ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు.

ప్యాకేజీ ధరలు..

కంపెనీ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఈ అంత్యక్రియల ప్యాకేజీ ధరలు సుమారు రూ. 6,000 నుంచి ప్రారంభమవుతాయి. ఎంచుకునే సేవలను బట్టి గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ప్యాకేజీలో అత్యవసరమైన దహన సంస్కారాల ఏర్పాట్లు మాత్రమే ఉంటాయి. ఎక్కువ ధర ఉన్న ప్యాకేజీలలో అదనపు పూజలు, అస్థికల నిమజ్జనం, శ్రాద్ధ కర్మల వంటి పూర్తి స్థాయి సేవలు కవర్ అవుతాయి. అన్నింటికీ ఒకే ఫిక్స్‌డ్ ధర కాకుండా, వ్యక్తి లేదా కుటుంబం ఎంచుకునే అవసరాలను బట్టి ఛార్జీలు మారుతుంటాయని స్పష్టం చేస్తున్నారు.

Moksha Voyage

Moksha Voyage

ప్రీ-బుకింగ్‌కు భారీ స్పందన..

ఈ స్టార్టప్‌లో ఉన్న అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ ‘ప్రీ-బుకింగ్’. ఒంటరిగా ఉండే వృద్ధులు లేదా తమ చివరి కోరికలను, అంత్యక్రియల విధానాన్ని ముందే నిర్ణయించుకోవాలనుకునే వారు బతికుండగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో ఈ సంస్థ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయగా, అక్కడికక్కడే 300 మందికి పైగా ఈ సేవ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. కష్ట సమయంలో కుటుంబాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని సంస్థ చెబుతుండగా, నెట్టింట మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క దీనిని సమర్ధించే వారు ఉంటే మరోవైపు మాత్రం చావు తెలివితేటలు అంటే ఇవేనేమో.. ఓరి నాయనో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *