Headlines

Indian Toilet vs Western Toilet: మీ ఆరోగ్యానికి ఏ టాయిలెట్ బెస్ట్?


మన రోజువారీ జీవితంలో చేసే పనులు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. అందులో మరి ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం టాయిలెట్ వినియోగం. మలవిసర్జన చేసే సమయంలో మనం కూర్చునే విధానం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఇండియన్ టాయిలెట్లతో పాటు వెస్ట్రన్ టాయిలెట్ల వినియోగం కూడా బాగా పెరిగింది. కొందరు సంప్రదాయ ఇండియన్ టాయిలెట్లే ఆరోగ్యానికి మంచివని భావిస్తుంటే.. మరికొందరు వెస్ట్రన్ టాయిలెట్లు సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? ఏ టాయిలెట్ వాడితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది? సహా పలు ముఖ్య విషయాలు తెలుసుకుందాం…

మలవిసర్జన ప్రక్రియ..

మలవిసర్జన ప్రక్రియ వెనుక శరీర ధర్మశాస్త్రం దాగి ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మలద్వారం (రెక్టమ్) నిండినప్పుడు అది సంకోచించి.. పాయువు వద్ద ఉండే కండరాలను సడలిస్తుంది. సాధారణ సమయాల్లో ‘ప్యూబోరెక్టాలిస్’ అనే కండరం మలద్వారాన్ని ఒక ఉచ్చులా పట్టి ఉంచుతుంది. అందువల్ల మలం బయటకు రాకుండా ఒక కోణంలో (ఆనోరెక్టల్ యాంగిల్) బంధించబడి ఉంటుంది. కానీ  మలవిసర్జన సమయంలో మాత్రమే ఈ కండరం వదులుగా మారి ఆ మార్గాన్ని తెరవడంతో ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఇండియన్ టాయిలెట్..

ఎన్నో ఏళ్లుగా భారతీయులు మలవిసర్జన కోసం ‘స్క్వాటింగ్’ (కింద కూర్చునే పద్ధతి – ఇండియన్ టాయిలెట్) పొజిషన్‌నే అనుసరించేవారు. అయితే సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ అలవాటును పక్కన పెట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్లు (కమోడ్లు) తప్పనిసరి అయ్యాయి. అయితే మన శరీరానికి కింద కూర్చునే పద్ధతే ఎంతో అనుకూలమైనదని చెబుతున్నారు. ఈ పద్దతిలో కూర్చున్నప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు పూర్తిగా మడిచి ఉండి.. శరీరం సుమారు 35 డిగ్రీల కోణంలో వంగుతుంది. దీనివల్ల ప్యూబోరెక్టాలిస్ కండరం పూర్తిగా సడలి, మలద్వార మార్గం ఎలాంటి అడ్డంకులు లేకుండా నిటారుగా తెరుచుకుంటుంది. దాంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా మలం సులభంగా బయటకు వస్తుంది. అందుకే ‘స్క్వాటింగ్’ పొజిషన్‌ను అత్యంత శాస్త్రీయమైన పద్ధతిగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు వెస్ట్రన్ టాయిలెట్‌లో కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చోవాల్సి ఉంటుంది. ఈ భంగిమలో మలవిసర్జన పూర్తిగా సులభం కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ కూర్చోవడం, లేవడం సులభంగా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు, శారీరక ఇబ్బందులు ఉన్నవారికి ఇది ఉత్తమమని చెబుతున్నారు.

ఆరోగ్యానికి ఏ టాయిలెట్ ఉత్తమం?

నిజానికి ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్‌లలో ఒకటే అందరికీ ఉత్తమమని చెప్పలేం. అది వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, శారీరక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇండియన్ టాయిలెట్‌లో కూర్చునే భంగిమ మలవిసర్జన సులభంగా జరగడానికి తోడ్పడవచ్చు. మరోవైపు వెస్ట్రన్ టాయిలెట్ వృద్ధులు, కీళ్ల సమస్యలు ఉన్నవారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అందుకే యువకులు, ఆరోగ్యంగా ఉన్నవారు ఇండియన్ టాయిలెట్‌ను ఉపయోగించవచ్చని.. అయితే మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు, శారీరక ఇబ్బందులు ఉన్నవారికి వెస్ట్రన్ టాయిలెట్ బెటర్ అని అంటున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించేవారు కూడా మలవిసర్జన సమయంలో కాళ్ల కింద చిన్న స్టూల్ పెట్టుకోవడం ద్వారా స్క్వాటింగ్ భంగిమకు దగ్గరగా ఉండే స్థితిని పొందవచ్చని సూచిస్తున్నారు.

ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్య సమస్యలు తప్పవా?

ఇండియన్ టాయిలెట్‌లో ఎక్కువసేపు కింద కూర్చోవడం వల్ల మోకాళ్లు, చీలమండలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కీళ్ల సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిగా మారవచ్చు. వెస్ట్రన్ టాయిలెట్‌లోనూ ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఫోన్ చూస్తూ లేదా ఇతర పనుల్లో నిమగ్నమై ఎక్కువ సమయం గడిపితే మలద్వారంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పైల్స్ వంటి సమస్యలను మరింత ఇబ్బందికరంగా మార్చవచ్చు. కాబట్టి ఏ టాయిలెట్ ఉపయోగించినా అవసరానికి మించి ఎక్కువసేపు కూర్చోకూడదని హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *