IND vs SL : భారత క్రికెట్ జట్టు త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ కప్టెన్సీలో బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌లోకి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చోటు దక్కించుకున్నారు. అయితే బుమ్రా, సాయి సుదర్శన్ మ్యాచ్ ఆడటం వారి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు సారాంశ జైన్ రూపంలో కొత్త ఆల్ రౌండర్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్ల వివరాలు చూద్దాం.
1. సచిన్ టెండూల్కర్
శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ లంకపై 25 టెస్టు మ్యాచ్‌ల్లోని 36 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 1995 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంకపై ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 203 పరుగులు.
2. రాహుల్ ద్రవిడ్
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ద్రవిడ్ శ్రీలంకపై 20 టెస్టుల్లోని 32 ఇన్నింగ్స్‌లలో 1508 పరుగులు సాధించారు. లంకపై ఆయన 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదారు. ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 177 పరుగులు.
3. వీరేంద్ర సెహ్వాగ్
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శ్రీలంక బౌలర్లను భయపెడుతూ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సహవాగ్ కేవలం 11 టెస్టుల 18 ఇన్నింగ్స్‌లలోనే 1239 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంకపై సెహ్వాగ్ అత్యధిక స్కోరు 293 పరుగులు. కొద్దిలో ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ లంకపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా ఆయనే టాప్‌లో ఉన్నారు.
4. మహమ్మద్ అజహరుద్దీన్
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. 1985 నుంచి 1999 మధ్య కాలంలో లంకపై 17 టెస్టుల్లోని 23 ఇన్నింగ్స్‌లలో అజహర్ 1215 పరుగులు చేశారు. అందులో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజహరుద్దీన్ అత్యధిక స్కోరు 199 పరుగులు. కేవలం ఒకే ఒక్క పరుగుతో డబుల్ సెంచరీ మిస్ అయ్యారు.
5. విరాట్ కోహ్లీ
ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే దృష్టి పెట్టిన కింగ్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. కోహ్లీ శ్రీలంకపై 11 టెస్టుల 18 ఇన్నింగ్స్‌లలో 1085 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లంకపై కోహ్లీ అత్యధిక స్కోరు 243 పరుగులు. సెహ్వాగ్ (293) తర్వాత శ్రీలంకపై టెస్టుల్లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి