Headlines

Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఐటీ మంత్రి ఓఎస్డీనంటూ రూ.50లక్షలు టోకరా!


Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఐటీ మంత్రి ఓఎస్డీనంటూ రూ.50లక్షలు టోకరా!

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓఎస్డీ పేరుతో నకిలీ అవతారం ఎత్తి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఇద్దరు కేటుగాళ్లను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రామంతాపూర్‌కు చెందిన కొలుగూరి రవికిరణ్ ప్రధాన నిందితుడిగా, గుంటూరులో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న రవికుమార్ మరో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి తాము మంత్రి కార్యాలయానికి చెందిన అధికారులమంటూ నిరుద్యోగులను నమ్మించారు. టీచర్, మున్సిపల్ అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డు అసిస్టెంట్ వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి, అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

బాధితులను పూర్తిగా నమ్మించేందుకు నిందితులు పక్కా పథకం ప్రకారం నకిలీ ఓఎస్డీ గుర్తింపు కార్డులు, నకిలీ ప్రభుత్వ నియామక ఉత్తర్వులను సృష్టించారు. అంతేకాకుండా, అసలైన ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలిన నకిలీ పోర్టళ్లను కూడా తయారు చేసి అభ్యర్థుల వివరాలను అందులో అప్‌లోడ్ చేసినట్లు నమ్మించారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది మంది నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడగా, అందులో నలుగురు బాధితుల నుంచి ఏకంగా రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలపై అనుమానం వచ్చిన బాధితులు నేరుగా మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

మంత్రి కార్యాలయ అధికారుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ గుర్తింపు కార్డులు, తెలంగాణ ప్రభుత్వ స్టిక్కర్/పేరుతో ఉన్న ఒక కారు, పలు కీలక పత్రాలతో పాటు రూ.2.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితులు సృష్టించిన నకిలీ వెబ్‌సైట్లు, ఇతర డిజిటల్ ఆధారాలు, వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *