Headlines

Hyderabad: ప్రకృతి రహస్యం ఛేదించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. ఇక పంటలకు వైరస్ భయం లేనట్టే!

Hyderabad: ప్రకృతి రహస్యం ఛేదించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. ఇక పంటలకు వైరస్ భయం లేనట్టే!


హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన జర్నల్ ఆఫ్ అమెరికన్ కెమికల్ సొసైటీలో ప్రచురితమైంది. సీనియర్ శాస్త్రవేత్త మందర్ వి దేశ్‌ముఖ్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఇప్పటివరకు వైరస్‌లపై మొక్కల రక్షణ వ్యవస్థ ‘తాళం-తాళంచెవి’ విధానంలో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావించేవారు. వైరస్‌లలో ఉండే డబుల్ స్ట్రాండెడ్ ఆర్‌ఎన్‌ఏను గుర్తించి ప్రోటీన్లు వాటిని అడ్డుకుంటాయని అనుకున్నారు. అయితే తాజా పరిశోధనలో అంతకంటే క్లిష్టమైన, చురుకైన ప్రక్రియ వెలుగులోకి వచ్చింది.

శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రత్యేక ఆర్‌ఎన్‌ఏ బైండింగ్ ప్రోటీన్ల ఉపరితలంపై పాజిటివ్, నెగటివ్ విద్యుత్ ఛార్జీలతో కూడిన ‘స్టిక్కీ ప్యాచ్‌లు’ ఏర్పడుతున్నాయి. ఇవి ఒకదానికొకటి ఆకర్షితమై పరస్పరం కలుస్తూ జాలంలాంటి నిర్మాణాన్ని తయారుచేస్తాయి. ఈ జాలం దట్టమైన ద్రవరూపపు బిందువులుగా మారి వైరస్ జన్యు పదార్థాన్ని చుట్టుముట్టేస్తుంది. దీంతో వైరస్‌కు అవసరమైన కణ యంత్రాంగంతో సంబంధం తెగిపోతుంది. తన జన్యు పదార్థాన్ని కాపీ చేసుకునే సామర్థ్యం కోల్పోయిన వైరస్.. ఇతర కణాలకు వ్యాపించలేక చివరకు నిర్వీర్యమవుతుంది.

ఈ పరిశోధనలో న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్‌ఎంఆర్) స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ డైనమిక్స్ సిమ్యులేషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించారు శాస్త్రవేత్తలు. ఈ ఆవిష్కరణతో సహజ రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న కొత్త పంట రకాలను అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది డాలర్ల నష్టం కలిగించే వైరల్ వ్యాధులను ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, ఇదే విధానాన్ని ఆధారంగా చేసుకుని మనుషుల్లో డిమెన్షియాకు కారణమయ్యే హానికర ప్రోటీన్ గడ్డలను కరిగించే ఔషధాలు, క్యాన్సర్ ట్యూమర్ల చుట్టూ ఏర్పడే రక్షణ పొరలను విచ్ఛిన్నం చేసే చికిత్సలను అభివృద్ధి చేసే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. త్వరలోనే  పరిశోధనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. జీవకణం అనేది కేవలం స్థిరమైన భాగాల సమాహారం కాదని, అవసరానికి అనుగుణంగా స్వయంగా ఏర్పడే ద్రవరూప నిర్మాణాలతో నిండిన చురుకైన ప్రపంచమని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *