
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బుద్వేల్‌లో చిట్టీల పేరుతో రూ. 5 కోట్ల మేర భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసముంటున్న అశోక్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గత కొంతకాలంగా చిట్టీలు నడుపుతూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధ్యులు అధిక లాభాలు ఎరవేసి అనేక మంది స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేశారు. అయితే, గడువు తీరిన తర్వాత డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తూ, రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యారు.
అశోక్ దంపతులు కనిపించకుండా పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం బుద్వేల్‌లోని అశోక్ ఇంటి ముందుకు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు. కష్టపడి దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో బాధితుల రోదనలు ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. బాధితుల్లో ఎక్కువమంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారే ఉండటంతో, తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు అశోక్ దంపతులు ఎటు పరారయ్యారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించి, వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి, పరారీలో ఉన్న దంపతులను అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు తిరిగి దక్కేలా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.