ఆర్ధిక అవసరాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో నగదు కోసం చాలామంది తమ బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉండటంతో చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక గోల్డ్ లోన్‌కు పేపర్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు. నిమిషాల్లోనే బ్యాంక్‌కు వెళ్లి ఈ లోన్ మీరు పొందవచ్చు. దీంతో గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు
అయితే ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో వాటిపై ఎక్కువ మొత్తం లోన్ పొందే అవకాశముంది. బంగారం మార్కెట్ విలువ, స్వచ్ఛతను అంచనా వేసి లోన్ అనేది మంజూరు చేశారు. లోన్ టు వాల్యూ రేషియో(LTV) ఆధారంగా ఎంత వస్తుందనేది లెక్కిస్తారు. ఎల్టీవీని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. బంగారం ధరల పెరిగితే ఎక్కువ మొత్తంలో రుణం పొందవచ్చు.
ప్రస్తుతం ఎల్టీవీ ఎలా ఉందంటే.. రూ.2.5 లక్షల రుణం వరకు 85 శాతంగా ఉండగా.. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య 80 శాతంగా ఉంది. ఇక రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి 75 శాతంగా ఉంది. ఇక గోల్డ్ లోన్‌పై వార్షిక వడ్డీ రేటు 7.75 శాతం నుంచి 24 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఎల్టీవీ, రుణ మొత్తం, రుణదాత విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది.
అయితే గోల్డ్ లోన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బంగారం విలువ పడిపోతే బ్యాంకులు అదనపు పూచీకత్తు కోరే అవకాశముంది. లేదా ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణంలో కొత్త మొత్తాన్ని చెల్లించాల్సిందిగా కోరవచ్చు. ఇక ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైతే మరిన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ముందుగా నిర్ణయించిన టైమ్ పీరియడ్ దాటితే ఇబ్బందులు పడతారు.
మీ బకాయిలు అన్ని వసూలు చేయడానికి బ్యాంకులు మీ బంగారాన్ని వేలం వేయవచ్చు. దీని వల్ల మీరు బంగారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. లోన్ ఎక్కువగా ఉంటే మీరు చెల్లించాల్సిన ఈఎంఐ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రుణం పూర్తిగా చెల్లించడానికి నగదు ఖర్చు చేయాల్సి ఉంటుంది.




