స్టాక్ మార్కెట్లలో అస్థిరత, ప్రపంచంలో యుద్దాలు, ద్రవ్యోల్బణం తీవ్రతరవుతున్న తరుణంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలను ఫిజికల్‌గా కొనుగోలు చేయడమే కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇటీవల కాలంలో ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఈ రెండిటిల్లో ఏది బెటర్..? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి?
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF) అనేది ఫిజికల్ బంగారంకు సంబంధించి దేశీయ ధరను ట్రాక్ చేసే ఒక మార్కెట్-లింక్డ్ పెట్టుబడిగా చెప్పవచ్చు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయబడి ఉంటుంది.మార్కెట్ పనివేళల్లో షేర్ల వలే దీనిని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం లాంటివి చేయవచ్చు. గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులకు డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ కలిగి ఉండాలి. అధిక స్వచ్ఛత గల ఫిజికల్ బంగారంలో నేరుగా పెట్టుబడి పెడతారు కాబట్టి వాటి రాబడులు బంగారం ధరలను దగ్గరగా ప్రతిబింబిస్తాయి.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ఇది ప్రధానంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల వలే కాకుండా.. ఈ ఫండ్లకు డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. పెట్టుబడిదారులు ఏదైనా మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి సిప్ల ద్వారా లేదా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. మొదటిసారి పెట్టుబడి పెట్టేవారితో పాటు క్రమమైన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూలంగా ఉంటాయి.
ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయబడతాయి కాబట్టి.. వాటికి సాధారణంగా తక్కువ వ్యయ నిష్పత్తులు, అధిక లిక్విడిటీ ఉంటాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం సులభం. ఎందుకంటే వీటికి ట్రేడింగ్ ఖాతా అవసరం లేదు. అయితే పెట్టుబడిదారులు ఫండ్ నిర్వహణ వ్యయం, ఈటీఎఫ్ వ్యయం రెండింటినీ భరించాల్సి ఉంటుంది కాబట్టి వీటికి ఖర్చులు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. SIP పెట్టుబడి కేవలం గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో మీ బడ్జెట్, మీ సౌకర్యాన్ని బట్టి ఏది మంచిదనేది నిర్ణయం తీసుకోండి.