బంగారంకు డిమాండ్ పెరగడం, ధరలు ఆకాశాన్నంటడంతో మార్కెట్లో నకిలీ బంగారం, తక్కువ స్వచ్చత ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వస్తున్నాయి. కస్టమర్లను కొంతమంది మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్వచ్చమైన బంగారం అని చెప్పి నకిలీ లేదా తక్కువ క్వాలిటీ కలిగిన గోల్డ్‌ను అంటగడుతున్నారు. దీంతో మోసపోయాక కస్టమర్లకు అసలు విషయం తెలుస్తుంది. అయితే మోసపోయాక కాకుండా మీరు ముందు జాగ్రత్త పడవచ్చు.
కొన్ని చిన్న చిట్కాలు పాటించడం వల్ల మీరు మోసాల నుంచి బయటపడవచ్చు. అసలైన బంగారాన్ని గుర్తించడం ఎలా అంటే.. బంగారాన్ని కొనుగోలు చేసేముందు మీరు బీఐఎస్ త్రిభుజం లోగో చెక్ చేయండి. ఇక క్యారెట్, స్వచ్చత సంఖ్యను తనిఖీ చేయండి. స్వచ్చత సంఖ్య విషయానికొస్తే.. 22K916 అంటే 91.6 శాతం క్వాలిటీ కలిగిన గోల్డ్ అని అర్థం. ఇక 18K750 అంటే 75 శాతం స్వచ్చత కలిగినది అని అర్థం.
ఇక ఆ తర్వాత HUID నెంబర్ అనేది చాలా ముఖ్యం. ఈ నెంబర్ ఆరు అంకెలు కలిగి ఉంటుంది. అసలైన బంగారాన్ని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బీఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరు HUID నెంబర్ ఎంటర్ చేసి అసలైన బంగారమా.. లేదా అనేది గుర్తించవచ్చు. ఆ యాప్‌లోకి వెళ్లి వెరిఫై హెచ్‌యూఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ఆరు అంకెల నెంబర్ ఎంటర్ చేయాలి.
మీకు వ్యాపారి పేరు, హాల్ మార్కింగ్ సెంటర్, తేదీ, స్వచ్చతకు సంబంధించి సమాచారం మొత్తం వచ్చేస్తుంది. దీని వల్ల మీరు కొనుగోలు చేసేది అసలైన బంగారం అని సులువుగా గుర్తించవచ్చు. ఒకవేళ ఆ వివరాలు ఏవీ రాకపోతే అది నకిలీ బంగారం అని అర్ధం. అలాగే యాప్‌లోని వివరాలు, షాపులోని బంగారానికి మధ్య తేడాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి.
ఇక ప్రస్తుతం చాలా షాపుల్లో XRF మెషిన్లు ఉంటున్నాయి. మీరు వీటి ద్వారా మీ కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఈ టెస్టుకు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం పడుతుంది. ప్రతీ కస్టమర్‌కు ఈ పరీక్షను స్వయంగా చేయించుకునే హక్కు ఉంది. బిల్లు కంటే ముందు ఈ టెస్ట్ చేయించుకోండి. దీని వల్ల మీ బంగారం స్వచ్చత తెలుస్తుంది.




